టాలీవుడ్ లో మహా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ బోయపాటి శ్రీను. ఫ్యామిలీ స్టోరీ తీసినప్పటికీ.. అందులో తనదైన శైలిలో మాస్ అంశాల్ని పుష్కలంగా ఇన్ సెర్ట్ చేస్తాడాయన. హీరోలకు హైఓల్టేజ్ ఇమేజ్ తెచ్చిపెట్టడంలో మాస్టర్ అయిన ఆయన .. ప్రస్తుతం బాలకృష్ణతో ఒక సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో బాలయ్యతో రెండో బ్లాక్ బస్టర్ మూవీస్ ను తీయడంతో ఇప్సుడు వారిద్దరి కాంబోమీద విపరీతమైన అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే.. దీని తర్వాత బోయపాటి తీయబోయే సినిమా మీద ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బోయపాటి.. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఒక స్టోరీ లైన్ వినిపించినట్టు.. దానికి విజయ్ ఇన్ స్పైర్ అయి.. పూర్తి స్ర్కిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. సరికొత్త కాంబినేషన్స్ లో పలు చిత్రాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో ఫైటర్ అనే సినిమా హడావిడిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యూరోప్ లో చిత్రీకరణ జరుపుకోడానికి రెడీ అవుతోంది.
అన్నీ కుదిరితే.. బోయపాటి తెరకెక్కించబోయే ఒక మాస్ మూవీలో విజయ్ దేవరకొండ నటిస్తాడు. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకూ విజయ్ చేసినవన్నీ రొమాంటిక్ మూవీసే. ఫస్ట్ టైమ్ బోయపాటి సినిమాలో విజయ్ మాస్ హీరో అవతారమెత్తుతాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ స్టైల్లో ఉంటుందో లేక బోయపాటి స్టైల్లోనే ఊర మాస్ గా ఉంటుందో చూడాలి.