ఏపీ రాజకీయాల్లో ఇది తాజా కలకలం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి ప్రాణహాని ఉన్నదంటూ ఒక వ్యక్తి పంపిన మెసేజీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త రభసకు కారణం అవుతోంది. సదరు దుండగుడు నేరుగా అయ్యన్నపాత్రుడికే మెసేజీ పంపాడు. ఈ మేరకు ఆయన ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు.
అయ్యన్న పాత్రుడితో పాటు మరో ఆరుగురికి కూడా ప్రాణహాని పొంచి ఉన్నదంటూ ఆ వ్యక్తి మెసేజీలో హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని, నేరులో కలిసి వివరించేందుకు అవకాశం ఇవ్వాలని ఆ వ్యక్తి మెసేజీలో కోరినట్లుగా తెలుస్తోంది.
ఈ మెసేజీ చేసిన బుచ్చయ్యపేటకు చెందిన వియ్యపు తాతారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించారు.
వారం కిందటే బెదిరించారు..
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు బెదిరింపు మెసేజులు వారం రోజులు క్రితమే వచ్చినట్టుగా తెలుస్తోంది. తొలుత గుర్తుతెలియని వ్యక్తినుంచి ఫోన్ కాల్ వచ్చినట్టుగా అనుకున్నారు. హత్య చేసి మావోయిస్టులు చేసినట్లుగా చిత్రీకరిస్తారు అంటూ మెసేజీలో వివరించినట్లు సమాచారం.
ఫోన్ నెంబరు ఆధారంగా పోలీసులు ట్రేస్ చేశారు. మెసేజీ పంపిన వ్యక్తి, బుచ్చయ్య పేట కు చెందిన తాతరావుపై 419, 509 సెక్షన్ ల కింద నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు











