ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉండి ఇప్పుడు దిగిరానంటోంది. ఓ వైపు వర్షాలు మరోవైపు కుల్లిపోతున్న స్టాక్‌తో ఇప్పట్లో ఉల్లి ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నాణ్యమైన ఉల్లి ధర మార్కెట్‌లో 80 రూపాయల వరకు పలుకుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట చేలల్లోనే మురిగిపోయిందని .. స్టాక్ పెట్టిన ఉల్లిగడ్డ కూడా రోజురోజుకు పాడై పోతుండటంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడర్లు. దీంతో మార్కెట్‌లో ఉల్లి వైపు చూడాలంటేనే సామాన్యులు జంకుతున్నారు.
రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు
దీంతో సామాన్యులకు ఉల్లి కష్టాల నుండి ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఉల్లి ధరల కాక ప్రభుత్వానికి తాకక ముందే మేల్కొన్న ప్రభుత్వ పెద్దలు సబ్సిడీ రేటుకు ఉల్లిని అమ్మాలని నిర్ణయించారు. ఇందుకోసం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌంటర్లలో ఏదైనా గుర్తింపు కార్డు చూపించి సబ్సిడీ ధరకు ఉల్లి కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. మార్కెట్‌లో 80 రూపాయలు పలుకుతున్న ఉల్లిని ఇక్కడ 35 రూపాయలకే అమ్మేందుకు నిర్ణయించారు. గతంలోనూ ఉల్లి ధరలు పెరిగిన సమయంలో ఇదే తరహాలో సబ్సిడీతో ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేవారు. దీంతో మార్కెట్‌లో యథేచ్ఛగా ధరలు పెంచే విధానానికి అడ్డుకట్ట వేసేందుకు వీలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
వర్షాలకు తగ్గిన దిగుబడి
గత పదిహేను రోజులుగా తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురవడంతో ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. దీంతో ఇతర రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతి చేయడాన్ని మహారాష్ట్ర తగ్గించడంతో ఇక్కడ ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ , సికింద్రాబాద్‌లలోని 11 రైతు బజార్లలో ఈ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లాభాల దృష్టిలో కాకుండా రవాణ ఖర్చులు చూసుకుని ఉల్లిని విక్రయించాలని ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను ఆదేశించింది.











