చాలా కాలం తరువాత అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదె బ్బ తగిలిందని చెప్పవచ్చు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లేకుండానే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టు వైస్ కెప్టెన్ కూడా అయిన రోహిత్.. తొడ కండరాల గాయం కారణంగా ఆ పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్ లో సత్తా చాటుతున్న హైదరాబాద్ పేసర్ సిరాజ్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ 20 జట్టుకు ఎంపికయ్యాడు.
సోమవారం వీడియో కాన్ఫ్ రెన్స్ ద్వారా సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆ జట్లను ప్రకటించింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో గాయపడి ముంబయి ఇండియన్స్ ఆడిన గత రెండు మ్యాచ్ లకు దూరమైన రోహిత్ శర్మను జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు. తొడ కండరాల గాయం తిరగబెట్టడంతో అతను ఈ ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లూ ఆడే అవకాశం కనిపించడం లేదు.
ఐపీఎల్ లోనే గాయపడ్డ పేసర్ ఇషాంత్ శర్మ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రస్తుతానికి అతడికి జట్టులో చోటివ్వలేదు. ఇషాంత్ కోలుకుంటే టెస్ట్ జట్టులోకి వచ్చే అవకాశముంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
2019 లో వెస్టిండీస్ సిరీస్ తరువాత రాహుల్ కు మళ్లీ ఇప్పుడు టెస్ట్ జట్టులో చోటు దక్కింది. వన్టేలు, టీ 20ల్లో అతనే వికెట్ కీపింగ్ చేయనున్నాడు. పంత్ ను కేవలం టెస్టులకే ఎంపిక చేశారు. పేసర్ మహ్మద్ సిరాజ్ ను అయిదో పేసర్ గా టెస్ట్ ల్లోకి తీసుకున్నారు. ఐపీఎల్ లో రాణిస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని టీ20లకు ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్య వన్డే, టీ 20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెలలో మొదలవనున్న పర్యటనలో భాగంగా కంగారూ గడ్డపై టీమ్ ఇండియా మూడు టీ20లు, వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది.











