సిద్దిపేటలో జరిగిన పరిణామాలతో బండి సంజయ్ తీవ్ర మనస్తాపానికి గుర్యయ్యారు. సిద్దిపేటలో రఘునందన్ రావు మామను పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఆపార్టీ సీరియస్‌గా ఉంది. అవమానకర రీతిలో తమ అధ్యక్షుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కక్ష పూరితంగానే తమ అధ్యక్షుడిపై దాడి చేశారని.. ఇది ఎంత వరకు సమంజసమంటున్నారు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీని ఇలా పోలీస్ వాహనంలో కుక్కి ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంటున్నారు.
ఎస్పీ ఆఫీస్‌కు పిలిపించి మరీ అరెస్ట్..
రఘునందర్ రావు బంధువుల ఇళ్లపై పోలీసులు దాడులు చేసి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురిచేశారన్న విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ సిద్దిపేటకు బయలు దేరారు. సిద్దిపేటకు చేరుకున్న సంజయ్‌ని పోలీసులు ఎస్పీ ఆఫీస్‌కు పిలిపించగా ఆయన అక్కడకు వెళ్ళారు. ఎస్పీ సమక్షంలో పోలీసులు ఆయనతో మంతనాలు జరిపారు. మీరు వెళ్తే పరిస్థితి మరింత ఇబ్బందిగా తయారవుతుందని, అల్లర్లు జరిగే పరిస్థితి తలెత్తుతుందని పోలీసులు సంజయ్‌కి వివరించగా వారి తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్య పరిష్కరించాల్సింది పోలీసులేనని.. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన వారు పరామర్శించేందుకు వెళ్తున్న తనను పిలిచి ఇలా వారించడం తగదని ఆయన ప్రశ్నించారు.
పోలీసులు కావాలనే తనను ఇక్కడ నుండి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించిన సంజయ్- రఘునందన్ బంధువును పరామర్శించేందుకు బయలు దేరారు. ఎస్పీ ఆఫీస్ నుండి బయటకు రాగానే ఒక్కసారిగా సంజయ్‌ను చుట్టుముట్టిన పోలీసులు పెట్రోలింగ్ వాహనంలోకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు తన గొంతు పట్టుకుని పిసికే ప్రయత్నం చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సంజయ్‌కి తీవ్ర గాయం కావడమే కాకుండా ఊపిరాడనివ్వకుండా చేశారని.. తాను బాధతో అరచినా పోలీసులు వదిలి పెట్టలేదంటున్నారు సంజయ్.
పోలీసులు ఎన్నికల నియామవళి ఉల్లంఘించారు : బీజేపీ
సంజయ్‌ను సిద్దిపేటకు వెళ్లనివ్వక పోవడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని బీజేపీ వారంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో ఉన్నారని, ఆయనకు ఎన్నికల కమిషన్ పాస్ కూడా ఇచ్చినట్టు బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించకుండా ఆయనను ఎలా అడ్డుకుంటారని, తమ కార్యకర్తలను కలవకుండా చేయడానికి పోలీసులకు ఏం హక్కుందంటున్నారు.
ఇక రఘునందన్ బంధువుల ఇంట్లో దొరికాయని చెబుతున్న డబ్బులను పోలీసుల చేతి నుండి లాక్కున్న వారిని పట్టుకుంటామని చెప్పిన పోలీసులు.. ఎంపీగా ఉన్న బండి సంజయ్‌పై ఎస్పీ కార్యాలయం ముందే దాడి చేసిన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. దీంతో పోలీసుల ఓవర్ యాక్షన్ వారికే రివర్స్ అటాక్ ఇవ్వనుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దాడి రూపంలో అరెస్టు అవసరమా?
బండి సంజయ్ పోలీసుల మాటను ఆలకించి ఉండకపోవచ్చు. ఆయన అరెస్టు అవసరం, వేరే మార్గం లేదు అని పోలీసులు భావించి ఉండచ్చు. కానీ.. అరెస్టు చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆయన మామూలు రోడ్ సైడ్ రౌడీ, గూండా కాదు. దేశంలోనే అత్యున్నతమైన చట్టసభలో సభ్యుడు. పార్లమెంటు మెంబరు. అలాంటి వ్యక్తిపై దౌర్జన్యం చేసి అరెస్టు చేయడం అనేది తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ కూడా ఈ విషయాన్ని బాగా సీరియస్ గా తీసుకుంటోంది. పోలీసుల తీరు కూడా ప్రశ్నార్థకం అవుతున్న వేళ.. తమ పనితీరులో రాజకీయంగా ఏకపక్షంగా పనిచేస్తున్న భావన లేదని నిరూపించుకోడానికి వారు బండి సంజయ్ మీద దౌర్జన్యం చేసిన పోలీసు పై చర్య తీసుకోవడం తప్ప మార్గం కనిపించడం లేదు.