జీవితం నీటిబుడగలాంటిది .. యవ్వనం పాల నురగలాంటింది. అందువల్లనే ప్రతి ఒక్కరూ ఆనందాన్నే వెతుక్కుంటారు .. సంతోషాన్నే కోరుకుంటారు. ఎవరెటుపోతే మనకెందుకు అనుకుని తమ సుఖాన్ని గురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరులు కొందరైతే, తమని నమ్ముకున్నవాళ్ల కోసం తమ జీవితాలను హారతి కర్పూరంలా కరిగించే త్యాగమూర్తులు మరికొందరు. ‘సంధ్య’ ఈ రెండవ కోవకి చెందుతుంది. మంచితనాన్ని అర్థం చేసుకోకపోతే అది అమాయకత్వంగా మిగిలిపోతుంది. త్యాగాన్ని గుర్తించకపోతే అది మనసును శిలగా మార్చేస్తుంది. సంధ్య జీవితంలోను ఇదే జరుగుతుంది. ఉలి దెబ్బలు తింటేనే శిల .. శిల్పంలా మారినట్టు, కష్టాల ఉలితో కాలం చెక్కిన కన్నీటి శిల్పంలా ‘సంధ్య’ కనిపిస్తుంది.
సుజాత ప్రధాన పాత్రధారిగా దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఈ నవంబరు 29తో 40 సంవత్సరాలను పూర్తి చేసుకోనుంది. కోదండరామిరెడ్డి పేరు వినగానే ఆయన అందించిన ఎన్నో విజయవంతమైన సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా చిరంజీవి క్రేజ్ ను పెంచిన దర్శకుడిగా .. ఆయన కెరియర్ ను పరుగులు తీయించిన దర్శకుడిగా కోదండరామిరెడ్డి కనిపిస్తారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా తన సినిమాలను ఆవిష్కరించిన కోదండరామిరెడ్డి, బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జునలతోను భారీ సినిమాలను అందించారు. అలాంటి ఆయన నాయిక ప్రాధాన్యత కలిగిన ‘సంధ్య’ అనే కథతో దర్శకుడిగా తన కెరియర్ ను ఆరంభించడం విశేషం.
‘సంధ్య’ సినిమా సమయానికే సుజాత మలయాళ .. తమిళ భాషల్లో చాలా సినిమాలను చేసేసింది. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్. సుజాతకి ఆమె హైటు .. నవ్వు .. నడక ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. తెరపై తాను కనిపించకుండా తన పాత్ర మాత్రమే కనిపించేలా పాత్రలో ఇమిడిపోవడం సుజాత ప్రత్యేకత. దుఃఖాన్ని దిగమింగుకునే సన్నివేశాల్లో సుజాత నటన ఎంతో సహజంగా ఉంటుందని దర్శకుడు బాలచందర్ ఇచ్చిన కితాబు .. ఆమె ప్రతిభకు కొలమానం. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే ఆమె ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు వంటి స్టార్ హీరోల నుంచి ప్రశంసలు అందుకోవడం విశేషం. అలాంటి సుజాత ‘గుప్పెడు మనసు’ తరువాత చేసిన నాయిక ప్రధానమైన చిత్రమే ‘సంధ్య’.
కథగా చెప్పుకుంటే .. చలపతిరావు (కాంతారావు)కి నలుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు .. ఒక అబ్బాయి. పెద్ద కూతురు సంధ్య( సుజాత) కాలేజ్ లో చదువుతుంటుంది. తల్లిని కోల్పోయిన సంధ్య .. తన తోబుట్టువులకు అక్కలా కాకుండా అమ్మలా మారుతుంది. స్కూల్ టీచర్ గా పని చేసే తండ్రి అనారోగ్యంతో మంచమెక్కడంతో, ఆ ఇంటి బాధ్యతను తానే తీసుకుంటుంది. తండ్రి మరణించడంతో ఆ ఇంటికి పెద్ద దిక్కులా మారుతుంది. శ్రీమంతుడైన డాక్టర్ కృష్ణ (శ్రీధర్) ను ఆమె ప్రేమిస్తుంది. అతను కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అయితే తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన తోబుట్టువులు నిరాదరణకు లోనవుతారని సంధ్య భావిస్తుంది. వాళ్ల జీవితానికి ఒక దారి చూపించిన తరువాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పటివరకూ తాను నిరీక్షిస్తానంటూ కృష్ణ కూడా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతాడు. కాలచక్రం గిర్రున తిరుగుతుంది .. సంధ్య తమ్ముడు మధు (చంద్రమోహన్) మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. ఇక తాను పెళ్లి చేసుకోవచ్చని సంధ్య ఆశ పడుతూ ఉండగానే, అతను తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్లిపోతాడు.
చెల్లెళ్లు కూడా సంధ్య త్యాగాన్నిమరిచిపోయి, డాక్టర్ కృష్ణతో ఆమెకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించి మనసును నొప్పిస్తారు. అయినా ఆమె వాళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపుతుంది. అందుకు చేసిన అప్పు కోసం ఉన్న ఒక్క ఇంటిని అప్పగించేసి ఒంటరిగా గడప దాటుతుంది. సంధ్య కోసమే నిరీక్షిస్తున్న డాక్టర్ కృష్ణ, ప్రేమతో ఆమె చేయి అందుకుంటాడు.
దర్శకుడు కోదండరామిరెడ్డి ‘సంధ్య’ పాత్రను గొప్పగా మలిచాడు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం చివరివరకూ తన తోబుట్టువులకు అండగా నిలిచే పాత్రలో సుజాత నటన కదిలించి వేస్తుంది. తన తోబుట్టువుల కోసం తన కలలను .. ఆశ లను .. కోరికలను సమాధి చేసుకుని, కాలంతో పాటు ఒంటరిగా పరిగెత్తే పాత్రకి ఆమె జీవం పోసింది. ఓర్పుతో పోరాడితే ఓటమి దరిచేరదనే సందేశం కూడా ఆ పాత్రలో కనిపిస్తుంది. ఇక ఆమె ప్రేమికుడిగా శ్రీధర్ కూడా మెప్పించాడు. ఒక వైపున తల్లి మనసును బాధ పెట్టలేక .. మరో వైపున సంధ్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేక నలిగిపోయే పాత్రలో ఆకట్టుకున్నాడు.
ఇక ఆ తరువాత సంధ్య తమ్ముడిగా నటించిన చంద్రమోహన్ గురించి చెప్పుకోవచ్చు. ఉద్దేశం మంచిదే అయినా వెళ్లే దారి సరైనది కాకపోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేది ఆయన పాత్ర నిరూపిస్తుంది. బంధాలు తెంచుకుంటే బాధలే మిగులుతాయనీ, సంతోషమనేది సంపదలో మాత్రమే ఉండదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇలా ఈ మూడు ప్రధానమైన పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఇక కథ మొత్తం బరువైన సన్నివేశాలతో సాగితే ప్రేక్షకులు అసహనానికి లోనవుతారనే ఉద్దేశంతో, అల్లు రామలింగయ్య – జయవిజయల ట్రాక్ ను .. బకాసురులవంటి వాళ్ల పిల్లల పాత్రలను హాస్యానికి వాడుకున్నారు.
ఈ సినిమాకి జంధ్యాల సంభాషణలను అందించారు. ముఖ్యంగా సుజాత పాత్రకి ఆయన రాసిన మాటలు మనసును తాకకుండా వెళ్లవు. ”రెక్కలు వచ్చిన పక్షిపిల్ల గూట్లో ఎందుకుంటుంది?” .. ”నేను కొట్టిన చెంప దెబ్బలు గుర్తున్నాయి గానీ, నేను పెట్టిన గోరుముద్దలు మాత్రం నీకు గుర్తులేవు” అనే మాటలు గుర్తుండిపోతాయి. చక్రవర్తి అందించిన బాణీలు ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా ”ఈ అనంతకాల గమనంలో ఎవ్వరు నీవారూ .. ” అంటూ సాగే నేపథ్య గీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. సందర్భాన్ని బట్టి అక్కడక్కడా ప్లే అవుతూ వుండే ఈ పాట, సుజాత పాత్ర బరువు ఎంతనేది ప్రేక్షకుడికి తెలిసేలా చేయగలిగింది.
ఉదయానికీ .. రాత్రికి మధ్య ఊగిసలాడే ఆ సంధ్యలా, బరువు బాధ్యతల మధ్య ఈ సంధ్య నలిగిపోయిందనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు అభినందనీయం. హృద్యమైన కథాకథనాలతో అప్పట్లో మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు 40 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంటే బాధ్యతలన్నీ నెరవేర్చుకుని కథానాయిక పాత్ర పెళ్లి చేసుకున్న వయసు ఈ సినిమాకి వచ్చేసిందన్న మాట. సుజాత కెరియర్లో మరో మేలి ముత్యంలా .. కోదండరామిరెడ్డి కెరియర్లో ప్రత్యేకంగా కనిపించే పగడంలా ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పొచ్చు.
-పెద్దింటి గోపీకృష్ణ











