దుబ్బాక ఓటమి టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. దుబ్బాక ఓటమిని మరిపించేలా మరొక విజయాన్ని సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని దుబ్బాక ఓటమిని మరిపించేలా చేసేందుకు ఆ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేయబోతోంది. ఇందుకు నేరుగా కేసీఆరే ఇక రంగంలోకి దిగబోతున్నారట. డిసెంబర్ మొదటి వారంలో గ్రేటర్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉండడంతో ఆ ఎన్నికల్లో అమలుపర్చే వ్యూహాలను గులాబీ బాస్ పదును పెడుతున్నారట. ఈనేపథ్యంలోనే ఈరోజు ప్రగతి భవన్‌లో తమ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. దుబ్బాక ఓటమిపై, గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలతో ఆయన సీరియస్‌గా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి విపక్ష పార్టీలకు తమ బలమేంటో తెలియజేయాలని సూచించారట. అందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన డైరెక్షన్ చేశారట.
దుబ్బాక ఓటమిని టీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలో బీజేపీ పార్టీ గెలవడమనేది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. అందులోనూ అది టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కూడా. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతేనే మంచిదనే అభిప్రాయాలను మెజారిటీ ప్రజలు వ్యక్తం చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ పార్టీ.. తమకు రాష్ట్రంలో ఇక ఎదురు లేదనే అహంకార ధోరణితో ప్రజా వ్యతిరేక విదనాలను తీసుకొస్తుందనే విమర్శ ప్రభుత్వంపై ఉంది. ఉదాహరణకు కరోనా సమయంలో ఎల్ఆర్ఎస్ పేరుతో భారీ ఫీజులను వసూలు చేయడం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. టీఆర్ఎస్‌కు రాజకీయంగా ఓ గట్టి ఎదురుదెబ్బ తగిలితేనే ప్రజా వ్యతిరేక విధానాలను అమలుపర్చడంలో కాస్త ఆలోచించి అడుగులు వేస్తుందని అంతా అనుకున్నారు. ఈక్రమంలోనే ఆ ఎన్నికలతో ఏమాత్రం సంబంధంలేకున్నా చాలా మంది దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమినే కోరుకున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలు ఆ ఎన్నిక ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఫలితాలు వెలువడ్డాక టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపై స్పందిస్తూ ‘ ఆ పార్టీకి అలా జరగాల్సిందే!’ లాంటి అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేశారు. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు అధికార పార్టీపై ప్రజలకు ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఎంతలా ఉందో!.
130 సీట్ల టార్గెట్…
2016లో టీఆర్ఎస్ పార్టీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుంది. అయితే దుబ్బాక ఫలితాలకు ముందు 100 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. దుబ్బాకలో ఓటమిని చవిచూశాక ఆ పార్టీ టార్గెట్‌లో ఛేంజ్ చేసుకుంది. ఈసారి 150 డివిజన్లలో 130 డివిజన్లను గెలిచేలా టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌లో తమ సత్తా ఏంటో విపక్ష పార్టీలకు తెలిసేలా దెబ్బ కొట్టాలని భావిస్తోందట. ఈనేపథ్యంలోనే 130 టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుని ఎన్నికల్లో ముందుకు పోయేలా వ్యూహాలను రచిస్తోందని తెలుస్తోంది.
డిసెంబర్‌లో జీహెచ్ఎంసి ఎన్నిలు..
జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రేపు తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ రోజు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలతో సమావేశంను నిర్వహించింది. ఈ సమావేశంలో గ్రేటర్ ఎన్నికలపై ఆయా పార్టీల అభిప్రాయాలను కమిషన్ తీసుకుంది. అయితే ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీపావళి తరువాత ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నట్లు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి దాదాపు 15 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో తమ టార్గెట్ కు రీచ్ అవుతుందో లేదో చూడాలి మరి.