తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల గురించి ఏం ఆలోచిస్తున్నారు? వచ్చే తమిళనాడు ఎన్నికల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది? సొంత పార్టీ పెడతారా? వేరే వారితో కలిసి ముందుకు వెళతారా?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రేపు వెలువడబోతోంది. రజనీ కాంత్ పార్టీ మక్కల్ మండ్రమ్ జిల్లా కార్యదర్శులందరితోనూ రజనీ కాంత్ సోమవారం భేటీ కాబోతున్నారు. ఇందులో ఏం చర్చించబోతున్నారన్నదే ఇప్పుడు కీలకాంశం కానుంది. తను రాజకీయాలకు దూరంగా ఉండాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. మనకు తెలిసిన సమాచారం మేరకు ఆయన రాజకీయాల్లో కొనసాగాలనే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ విషయాన్ని పక్కన పెట్టి మరో పార్టీతో కలిసి ముందుకు సాగాలనే ప్రతిపాదనలు ఆయన ముందు ఉన్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. ఆయా రాష్ట్రాల్లో తన కేడర్ ను విస్తరించుకుంటూ చాపకింద నీరులా చొచ్చుకుపోతోంది. ఈ మధ్య అమిత్ షా తమిళనాడు వెళ్లినప్పుడు రజినీ కాంత్ తో సంప్రదింపులు జరిపారన్న టాక్ కూడా ఓ పక్క వినిపిస్తోంది. అదే నిజమైతే తమిళనాడులో మరో రాజకీయ పార్టీని కూడా కలుపుకుని రజనీకాంత్ సహకారంతో ముందడుగు వేయాలన్న ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే రజినీ తన మద్దతుదారులతో చర్చించబోతున్నట్టు సమాచారం.
ఒకవేళ రజినీ సొంత పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలంటే చాలా శక్తియుక్తులు కావాలి. ఆయన ఆరోగ్యరీత్యా అది అంత క్షేమదాయకం కాదని వైద్యులు సూచించారు. అసలు రేపు తమ జిల్లా కార్యదర్శులతో భేటీని ఆన్ లైన్ లోనే నిర్వహించాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అది ఏమాత్రం క్షేమదాయకం కాదని, విషయాలు బయటకు పొక్కే అవకాశాలు ఉండటంతో నేరుగా వారితో చర్చించటానికి మొగ్గుచూపారు. ఆమేరకే ఆహ్వానాలు పంపారు.
పుట్టిన రోజు నాడు అధికారిక ప్రకటన
డిసెంబరు 12న రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఏదైనా వార్తను అందించాలన్న సంకల్పంతో రజినీ ఉన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి రాదలుచుకుంటే ఆరోజున అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికే ఓ స్పష్టత వచ్చేస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ కు 69 ఏళ్లు. ఈ కరోనా సమయంలో జనంలో తిరగాల్సి వస్తుంది కాబట్టి రాజకీయాలు వద్దు అని వైద్యులు సూచించడం వల్లే రజినీ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
రజినీ వెనకడుగు వేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నిర్ణయాన్ని పున:పరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఇద్దరు శక్తిమంతమైన నాయకులు జయలలిత, కరుణానిధి లేకుండా జరుగబోతున్న ఎన్నికలివి. మరో నటుడు కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టారు. రజినీతో కలిసి పనిచేయటానికి తనకేమీ అభ్యంతరం లేదని కమల్ అంటున్నారు. రజినీ రాజకీయంగా కదలితే ఎవరు ఎవరితో కలుస్తారన్నదానిమీద ఇప్పుడే చెప్పలేం.
రజినీతో కలిసి ముందుకు సాగడానికి మాత్రం భాజపా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అమిత్ షాతో రజినీ భేటీ అయ్యారా లేదా అనే విషయం మీద కూడా స్పష్టత లేదు. రహస్యంగా చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు. ఏఐఏడీఎంకే కూడా వీరితో కలిసి వస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రజినీ కాంత్ రాజకీయ పయనంపై రేపు సాయంత్రానికి ఓ స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి.











