మానవ సంబంధాలు మంటకలిచిపోయిన సంఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఓ మహిళ రూ.10 లక్షలు సుఫారీ ఇచ్చి భర్తను చంపించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో భాష్యం బ్రహ్మయ్య హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బ్రహ్మయ్యకు, అమరావతికి చెందిన సాయికుమారితో 20 సంవత్సరాల కిందట వివాహం అయింది. వారికి బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కూతురు, బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారుడు ఉన్నారు. బ్రహ్మయ్య నడుపుతున్న హాటల్ పనుల్లో భార్య సాయికుమారి చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ మధ్య కాలంలో బ్రహ్మయ్య హోటల్ ఎదురుగా కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్న అకోక్ రెడ్డితో సాయికుమారికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం బ్రహ్మయ్యకు తెలియడంతో వారిని మందలించాడు. దీంతో ఎలాగైనా బ్రహ్మయ్యను అంతమొందించాలని భార్య సాయికుమారి, ప్రియుడు అశోక్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
సైనేడ్‌తో హతమార్చారు
బ్రహ్మయ్యను అడ్డు తొలగించాలని సాయికుమారి ప్రియుడు అశోక్ రెడ్డిని కోరింది. దీంతో అతనికి పరిచయం ఉన్న కారు డ్రైవర్ భార్గవ్ రెడ్డిని సంప్రదించాడు. వీరిద్దరూ కలసి మచిలీపట్నానికి చెందిన కారు డ్రైవర్ పవన్ కుమార్, తాపీ మేస్త్రి షేక్ షరీఫ్‌లను సంప్రదించారు. బ్రహ్మయ్యకు సైనేడ్ ఇచ్చి హతమార్చాలని నిర్ణయించుకున్నారు. పని అయిపోయాక పది లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ముందుగా సైనేడ్ కలిపిన బిస్కెట్‌ను కుక్కకు తినిపించారు. అది వెంటనే చనిపోవడంతో, ఇక బ్రహ్మయ్యను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారు. ప్రతిరోజూ సాయంత్రం హోటల్ వేస్ట్ పారవేసేందుకు బ్రహ్మయ్య బైక్‌పై వెళుతున్నాడని గమనించారు. ఈ నెల నాలుగో తేదీన బ్రహ్మయ్య హోటల్ వేస్ట్ పడేసేందుకు ఊరి చివరకు బండిపై వెళ్లగా అక్కడ కాపు కాసిన షరీఫ్, పవన్ కుమార్ బ్రహ్మయ్య మొహంపై సైనేడ్ స్ప్రే చేసి పరారయ్యారు. వెంటనే బ్రహ్మయ్య బైకుపై బంధువుల ఇంటికి చేరుకుని విషయం చెప్పి పడిపోయాడు. అతన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు.
కేసును ఎలా ఛేదించారంటే
బ్రహ్మయ్య హత్యపై సాయికుమారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. సాయికుమారి ప్రవర్తనపై అనుమానం వచ్చి గ్రామంలో విచారించారు. సాయికుమారికి అశోక్ రెడ్డితో అక్రమ సంబంధం ఉందని తేలింది. బ్రహ్మయ్య హత్య సమయంలో ఎవరెవరు ఫోన్లో మాట్లాడుకున్నారో పోలీసులు కాల్ డేటా సేకరించారు. దీంతో సాయికుమారి, అశోక్ రెడ్డి హత్య కుట్ర బయటపడింది. మానవ సంబంధాలు మంటకలిపిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.











