నవంబర్ నెల చివరి ఆదివారం వచ్చేసింది. అనుకున్నట్లుగానే ‘మన్ కీ బాత్’ ప్రసంగాన్ని రైతుల సమస్యా వేదికగా మార్చారు మోడీ. సాధారణంగా టీకా టూర్ నేపథ్యంలో వ్యాక్సిన్ కి ప్రాధాన్యం ఇస్తారని ఊహించారు. కానీ రైతుల ఆందోళన జరుగుతున్న సమయంలో మన్ కీ బాత్ వేదికగా రైతులను సమాధానపరిచే ప్రయత్నం చేస్తారని అందరూ ఊహించినట్లే, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల గురించి వివరించే ప్రయత్నం చేసి, రైతులను సముదాయించారు. మరి మోడీ ప్రసంగంలోని ప్రధానంశాలేమిటో చూద్దాం రండి…
మద్ధతు ధర ప్రస్తావన ఏది?
ప్రస్తుతం ఢిల్లీ వేదికగా రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. అవి అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. చివరికి ప్రభుత్వం దిగొచ్చి వారితో చర్చలకు ముందుకొచ్చింది. డిసెంబర్ 3 న రైతు సంఘాలతో చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రైతులు మాత్రం తమ ఆందోళనను తగ్గించడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలలో రైతులకు మద్ధతు ధర ప్రస్తావన ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు? మేము పండించిన పంట ధర నిర్ధారణ దళారుల చేతిలో పెట్టారని, రైతు వెన్ను విరుస్తారని ఆందోళన చేపడుతున్నారు.
ఇవి మీ కోసమే
రైతుల ఆందోళనకు సమాధానం అన్నట్లుగా మన్ కీ బాత్ లో తన ప్రసంగాన్ని రైతు సమస్యల ప్రస్తావనతో సమాధానాలు చెప్పారు మోడీ. కొత్త చట్టాల వల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదని పునరుద్ఘాటించారు. పంట ధర నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో 3 రోజుల్లోగా పడుతుందని, అలా పడని నేపథ్యంలో ఫిర్యాదు చేసే హక్కు రైతులకు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. వారి ఫిర్యాదులను జిల్లా అధికారి ఒక నెలలో పరిష్కరించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. దానికి ఉదాహరణగా ఒక రైతు సమస్యను కూడా వివరించారు మోడీ. దేశానికి వెన్నుముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు. కేవలం అవగాహానా లోపం వల్లే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని, ఈ చట్టాల వల్ల కలిగే ఫలాలు తొందరలోనే రైతులు అందుకుంటారని మోడీ ఉద్ఘాటించారు.
అమలైతే కానీ అర్ధం కావు
బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడడం… ఇవి వినడానికి బాగానే ఉన్నమాటే. చేతి కొచ్చే డబ్బైతే వాటిలో అవకతవకలకు తావుంటుంది. కానీ బ్యాంకు ఖాతాల్లో పడే డబ్బుకు ఎటువంటి అవకతవకలకు తావుండదు అని అందరి భావన. సంప్రదాయానికి, సాంకేతికతను జోడించాలనే మోడీ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందనేది మాత్రం అమలైతేగానీ తెలియదనే చెప్పాలి. కానీ, ఇప్పటికే అలాంటి పథకాలు మన దేశంలో చాలా అమలవుతున్నాయి. వాటిలో అవకతవకలు కూడా లెక్కలేనని జరుగుతున్నాయి. మరి ఈ చట్టాలు ఎంత వరకు మోడీ హామి ఇస్తున్న రీతిలో అమలవుతాయో చూడాలి.
ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత మాత్రం తను పండించే పంటకు ధర నిర్ణయించలేక బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడీ కొత్త చట్టాలు వారి గతిని మారుస్తాయో, అదోగతిలోకి నెడుతాయో వేచి చూడాలి.