అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళన నేటికి 350 రోజులకు చేరుకుంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇన్ని రోజులుగా వారి కుటుంబసభ్యులతో సహా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి వీడకుండా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మూడు రాజధానులు కావాలంటూ కిరాయి మనషులతో పోటీ ఉద్యమాలను నడిపిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా చేస్తున్నా నిజమైన అమరావతి రైతులు శాంతి యుతంగానే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రసుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలకు సీఎం వెళుతున్న సమయంలో కూడ అమరావతి రైతులు శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నారు గాని ఎటువంటి ఆందోళనలు చేయడం లేదు. అయినప్పటికీ పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
మందడంలో తీవ్ర ఉద్రిక్తత
అమరావతి పరిధిలోని మందడంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మ దహనానికి రైతులు యత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మూడు రాజధానులు శిబిరంలో దిష్టి బొమ్మలను కడితే వారిని ఏమి అనకుండా , తమ శిబిరంలో కట్టే దిష్టిబొమ్మను ఎలా అడ్డుకుంటారని పోలీసులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. రైతులను బలవంతంగా నెట్టేసి దిష్టిబొమ్మను తొలగించడంతో పోలీసులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.
కృష్ణాయపాలెం సంఘటనతోనైనా..
కృష్ణాయపాలెం రైతులపై కేసులు నమోదు చేసి బేడీలు వేసి జైలుకు తీసుకెల్లిన పోలీసులు దానికి ఫలితం అనుభవిస్తున్నారు. తర్వాత గుంటూరులో జరిగిన జైల్ భరో కార్యక్రమంలో కూడ పోలీసులు అమానుషంగా ప్రవర్తించి అభాసుపాలయ్యారు. ఇలా అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నా పోలీసులు పక్షపాతంగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కొవ్వొత్తులతో మహిళలు నిరసన
అమరావతి ఉద్యమం మొదలు పెట్టి 350 రోజులైన సందర్భంగా మందడంలో మహిళలు కొవ్వొత్తులతో నిరసనలు తెలిపారు. జై అమరావతి నినాదాలతో గ్రామం మారుమ్రోగింది. ఏది ఏమైనా తమ రాజధాని స్వప్నం నెరవేరేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని అమరావతి రైతులు అంటున్నారు.











