మెగాస్టార్ చిరంజీవి నటించిన బెస్ట్ మూవీస్ లో ‘ఛాలెంజ్’ ఒకటి. అందులో ‘ఇందువదన కుందరదన మందగమన మధురవచన’ పాటను ఇష్టపడనివారే ఉండరు. ఇళయరాజా సంగీత సారధ్యంలో చిరు, విజయశాంతి అద్భుతమైన డ్యాన్సులతో అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది ఈ పాట. ఇదే పాటను యంగ్ హీరో సుధాకర్ కోమకుల, అతడి భార్య నిహారిక సందెపోగు జంట రీక్రియేట్ చేసి మెగాభిమానుల్ని ఎంతగానో అలరించారు. ఈ ఇద్దరి మీద తెరకెక్కిన ఈ పాట అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పుడు ఈ జంట.. న్యూఇయర్ ను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలపడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. చిరంజీవి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించి వారికి ఆశీస్సులు అందచేశారు. ఈ సందర్భంగా ఇందువదన పాటలో ఆ ఇద్దరూ నర్తించడాన్ని చిరు ఎంతగానో మెచ్చుకున్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఆ ఇద్దరినీ ఆశీర్వదించారు. దాంతో సుధాకర్ కోమాకుల ఎంతగానో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వారికి తన సపోర్ట్ అందచేస్తున్న చిరంజీవి వ్యక్తిత్వాన్ని పలువురు కొనియాడుతున్నారు.











