తెలుగు తెరకి పరిచయమైన నాజూకు భామలలో ‘ప్రణీత సుభాశ్’ కచ్చితంగా కనిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ భాషల్లో ఈ సుందరి పెద్దగా గ్యాప్ లేకుండానే పరిచయమైంది. అయితే ఏ భాషలోనూ ఈ అమ్మాయి దూకుడు చూపలేకపోవడమే విశేషం. అందం లేదా అంటే కావలసిన దానికంటే ఎక్కువగానే ఉంది. పోనీ నటన రాదా అంటే .. ఇవాళా రేపు దానితో పెద్దగా పనేం లేదనే విషయం కూడా ఆమెకి తెలుసు. రంగులోను .. రూపంలోను కాజల్ కి కాస్తంత దగ్గరగా కనిపించే ఈ అమ్మాయి మరి ఎందుకు స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోతోంది అనేదే ఆమె అభిమానుల ముందున్న ప్రశ్న.
గులాబీ రంగు మేని ఛాయతో .. గులాబీ తోటలో కురిసిన ముత్యాల వానలా కనిపించే కళ్లతో ప్రణీత చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అందచందాల విషయంలో .. నాజూకుతనంలో ఆమెకి వంక బెట్టవలసిన పనేలేదు. ఆమె కెరియర్ పుంజుకోకపోవడానికి కారణం లౌక్యం తెలియకపోవడమో .. గ్లామర్ కి మించిన మొహమాటం ఉండటమో కారణం అనుకోవాలి. ఇలా ఎలా అనుకుంటారు అనే ప్రశ్నకి ఆమె ఎంచుకున్న సినిమాలే సమాధానంగా కనిపిస్తాయి. పదేళ్ల క్రితమే ‘బావ’ సినిమాతో గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ, ఇంతవరకూ బిజీ కాకపోవడం ఒక ఉదాహరణగా అనిపిస్తుంది.
‘అత్తారింటికి దారేది’ సినిమాతో ప్రణీత కెరియర్లో మంచి హిట్ చేరింది. దాంతో ఈ అమ్మాయి వరుస సినిమాలు చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే అటు ఎన్టీఆర్ తో చేసిన ‘రభస’ .. ఇటు మహేశ్ బాబుతో చేసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు పరాజయంపాలు కావడం ఆమె దురదృష్టం. అసలే చొచ్చుకెళ్లే స్వభావం లేని ప్రణీత మరింత స్లో అయింది. మెయిన్ హీరోయిన్ గా కాకపోయినా, సెకండ్ హీరోయిన్ గా నెట్టుకొస్తుందిలే అనుకుంటే, కొత్త ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపించడమే కష్టమైపోతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఇక లాభం లేదనుకుందేమో బాలీవుడ్ బాట పట్టింది. కాజల్ .. తమన్నా .. శ్రుతిహాసన్ వంటి చురుకైన భామలే బాలీవుడ్ స్పీడ్ ను అందుకోలేకపోయారు. మరి ఈ తామరాకు ఎంతవరకూ తట్టుకుంటుందో చూడాలి.