భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నగరానికి సంబంధించినంత వరకు ఆరుగురు అధ్యక్షులను నియమించడానికి సిద్ధపడింది. రాష్ట్రంలో పెద్దగా ఠికానా లేకపోయినా.. కేంద్రంలో హవా నడిపిస్తున్న పార్టీ గనుక.. ఆ పదవులకోసం సిటీలో పోటీ బాగానే ఉంది. దానికి తగ్గట్లుగానే గ్రూపులు పెరిగాయి. ఆరు స్థానాలను ఆశిస్తున్న నాయకుల సంఖ్య పదుల్లోనే ఉంది.
ఎమ్మెల్సీ రాంచందర్ రావు నివాసంలో హైదరాబాద్ నగర బీజేపీ నేతలతో బండి సంజయ్ మంగళవారం భేటీ నిర్వహించారు. ఆశావహులు అందరితోనూ ఆయన మాట్లాడారు. పదవులు ఎవరికి ఇచ్చినప్పటికీ.. అందరూ కలసి కట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సందేశం కూడా ఇచ్చారు. కానీ ఈ మాటలు ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు.
బండి సంజయ్ ఎదుటే పార్టీ నాయకుల మధ్య విభేదాలు, తగాదాలు బయటపడినట్టు సమాచారం. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ కు ఆరుగురు అధ్యక్షులను నియామకం పూర్తిచేయాల్సి ఉంది. ఈ నగర అధ్యక్ష పదవులకు పలువురు నేతలు పోటీ పడ్తోన్నారు. నగర అధ్యక్షుల ఎంపికలో పార్టీలో భిన్నాభిప్రాయాలు దండిగా ఉన్నాయి.
ఈ పోటీ ప్రధానంగా సీనియర్లు- జూనియర్ల మధ్య ఉంటోంది. తమకే అవకాశమివ్వాలని సీనియర్ నేతలు అంటుండగా.. పాత, కొత్త మేళవింపుతో నగర అధ్యక్షులను నియమిచాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా బీజేపీలోకి వచ్చిన వారికి అందలం ఎలా కట్టబెడతారనే విషయంలో సీనియర్లు అలకపూనుతున్నారు. అలిగిన వారిని బుజ్జగించడానికి అధ్యక్షుడు బండి సంజయ్ నానా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండడం లేదని తెలుస్తోంది.











