భాగ్యనగరం- డబుల్ డెక్కర్ బస్సులది అవినాభావ సంబంధం. హైదరాబాద్ లో చార్మినార్ ఎంత ఫేమసో.. ఒకప్పుడు డబుల్ డెక్కర్ అన్నా అంతే క్రేజ్ ఉండేది. ఆ బస్సు చూసేందుకు, ఎక్కేందుకు జిల్లాల నుంచి భాగ్యనగరానికి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. ఇక.. పైనున్న బస్సులో సీటు దొరికిందంటే ఆ మజా వేరిక! కానీ కొంతకాలం తర్వాత అవి కనుమరుగైపోయాయి. ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సులుండేవి.. తెలుసా? అని చెప్పుకోవడమే తప్ప.. అవి ఎక్కి ప్రయాణం చేసే అదృష్టం కరవైపోయింది. ఈ తరుణంలో హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులట.. అనే వార్త నగరవాసుల్లో చెప్పలేనంత సంతోషం కలిగిస్తోంది.
ఇదీ డబుల్ డెక్కర్ ప్రస్థానం..
1932లో నిజాం రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటయింది. హైదరాబాద్ స్టేట్‌లో బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆ తర్వాత 1942లో హైదరాబాద్‌లో ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఇది స్టీల్, ఇతర ఫర్నిచర్‌ను ఉత్పత్తి చేసేది. అందులో ప్రత్యేకంగా బస్సుల బాడీలను కూడా తయారు చేసేవారు. నిజాం రోడ్డు రవాణా సంస్థలోని బస్సులను ప్రముఖంగా ఇదే కంపెనీ తయారు చేసేది. అలా 1964లో మొదటి సారిగా లండన్ కంపెనీలైన పార్క్ రాయల్ వెహికిల్స్ లిమిటెడ్, ప్రెస్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ సాంకేతిక సాయంతో డబుల్ డెక్కర్ బస్సులను కూడా తయారు చేయడం ప్రారంభించింది.
1972లో తొలిసారిగా..
డబుల్ డెక్కర్ బస్సు తొలిసారిగా 1972లో భాగ్యనగరాన్ని పలుకరించింది. ఆ తర్వాత సిటీతో మూడున్నర దశాబ్దాల బంధం కొనసాగించింది. అప్పట్లో ఈ బస్సులు హైదరాబాద్ కే ఎంతో ప్రత్యేకంగా ఉండేవి. సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూసేవారు. ఒక్కసారైనా అందులో ప్రయాణించాలనే ఆశించేవారు. నగర రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులో వెళ్తుంటే అంబారీపై వెళ్తున్నట్లు అనిపించేందని చాలామంది ఇప్పటికీ చెప్తుంటారు. అప్పట్లో డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్, పశ్చిమబెంగాల్‌లో మినహా దేశంలో మరెక్కడా లేకపోవడం గమనార్హం.

మూడున్నర దశాబ్దాల బంధం..
భాగ్యనగరంతో డబుల్ డెక్కర్ బస్సులకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉంది. 1972 సంవత్సరంలో ఏపీఎస్‌ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులను పరిచయం చేసింది. ఆ తర్వాత సుమారుగా 34 ఏండ్ల పాటు ఆ బస్సులు భాగ్యనగర వీధుల్లో చెక్కెర్లు కొట్టాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ… ఎందరికో ప్రత్యేక అనుభూతిని అందించాయి. 2006వ సంవత్సరం అనంతరం డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగయ్యాయి.
నెటిజన్ ట్వీట్.. కేటీఆర్ ను తాకింది..
ఓ నెటిజన్ డబుల్ డెక్కర్ జర్నీని గుర్తుచేసుకుంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అది కేటీఆర్ మనసును తాకింది. ఆయన్ను కొంతసేపు గతంలోకి తీసుకెళ్లింది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. కేటీఆర్ సైతం స్పందించారు. దీంతో డబుల్ డెక్కర్ పై మళ్లీ ఆసక్తి ప్రారంభమైంది. తనకు డబుల్ డెక్కర్ బస్సులతో ఉన్న అనుభూతులను నెమరేసుకుంటూ ‘అప్పట్లో డబుల్ డెక్కర్లను ఎందుకు ఉపసంహరించుకున్నారో నాకు తెలియదు, వాటిని మళ్లీ నడిపే అవకాశం ఉందా’ అని ప్రశ్నిస్తూ దాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన ఆయన, వెంటనే ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడి, ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించారు.
రెండు నెలలు.. 25 బస్సులు..
డబుల్ డెక్కర్ బస్సులు మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా 25 బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించబోతోంది. బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు స్పష్టం చేయనుంది.
ఏఏ రూట్లు.. ఎన్నెన్ని బస్సులు..
డబుల్ డెక్కర్ బస్సులను ఏఏ రూట్లలో నడపాలి.. ఎన్నెన్ని నడపాలనే దానిపై ఇప్పటికే ఆర్టీసీ ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టే జరిగితే.. ఈ రూట్లలోనే బస్సులు చెక్కెర్లు కొట్టేది. రూట్ నెం.229 (సికింద్రాబాద్ – మేడ్చల్ వయా సుచిత్ర), రూట్ నెం.219 (సికింద్రాబాద్–పటాన్‌చెరు వయా బాలానగర్ క్రాస్ రోడ్డు), రూట్ నెం. 218 (కోఠి–పటాన్‌చెరు వయా అమీర్‌పేట), రూట్ నెం.9ఎక్స్ (సీబీఎస్–జీడిమెట్ల వయా అమీర్‌పేట), రూట్ నెం.118 (అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం)లను ఎంపిక చేశారు. దుర్గం చెరువుపై కొత్తగా కేబుల్ బ్రిడ్జి మీదుగా ఓ బస్సు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ట్రాఫిక్ కి సాధ్యమేనా?
డబుల్ డెక్కర్ భాగ్యనగరాన్ని మళ్లీ పలకరించండం సంతోషమే. కానీ.. అందరినీ వేధించేది ఒకటే ప్రశ్న. అప్పటితో పోల్చుకుంటే ఎన్నోరెట్లు జనభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ బస్సులు నడపడం అసలు సాధ్యమేనా? అని. అయితే.. ప్రస్తుత జనభా.. ఫ్లైఓవర్ల నిర్మాణం.. మెట్రో తదితర అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. నగరంలో పెరుగుతున్న పర్యాటక రంగం, అనేక కట్టడాలు వంటి వాటిని వీక్షిస్తూ ప్రయాణించేలా ఈ బస్సులను తీర్చిదిద్దుతోంది.











