కొద్ది రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. 39వ డివిజన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ ఎంపీ కేశినేని నాని మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేసేవిగా ఉన్నాయని అధినేత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. 39వ డివిజన్ అభ్యర్థిని ప్రకటించే వరకు ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని చంద్రబాబు ఆదేశించారు. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరైనా విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం వంటివి చేస్తే అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీప్పవని ఆయన హెచ్చరించారు.
మేయర్ అభ్యర్థి విషయంలోనూ విభేదాలు
కేవలం 39వ డివిజన్ అభ్యర్థి విషయంలోనే కాకుండా విజయవాడలో టీడీపీకి మెజారిటీ వస్తే మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై కూడా బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముగిసిన మేయర్ అభ్యర్థి కమ్మ కులానికి చెందిన వారు కావడంతో ఈ సారి కాపు, బ్రాహ్మణ,ముస్లిం కులాల నుంచి మేయర్ ను ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నాయకుడు నాగుల్ మీరా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా బహిరంగంగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. దీంతో విజయవాడ టీడీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది.











