చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్రంలోని మారుమూల పల్లెలతో పాటు ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఇవ్వాలని అనుకున్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం వల్ల.. నెమ్మదిగా అయినా సరే.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవనశైలి మారుతుందని, ఆధునిక ప్రపంచానికి వారు నిత్యం అందుబాటులో ఉంటారని ఆయన ఆలోచన. దానికోసం సుదీర్ఘమైన కసరత్తు చేసి.. చివరికి ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
కేవలం ఇంటర్నెట్ అంటే గ్రామీణ ప్రజలు అంతగా మొగ్గు చూపించకపోవచ్చుననే ఉద్దేశంతో.. ఇంటర్నెట్ ఒక్కటే కాకుండా, కేబుల్ టీవీని కూడా దానితో కలిపి ఒకటే సెట్ టాప్ బాక్స్ ద్వారా అందించే ఏర్పాటు చేశారు.
మొత్తానికి పది లక్షల సెట్ టాప్ బాక్సుల ద్వారా ఏపీ ఫైబర్ నెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కలిపి సుమారుగా 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. చంద్రబాబు ప్రభుత్వం మారిపోయిన తర్వాత.. జగన్ సర్కారు ఈ వ్యవహారంలో చాలా భారీగా అవినీతి జరిగిపోయిందని పేర్కొంటూ విమర్శలు చేసింది. విచారణ జరిపించింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు కూడా పాత్ర ఉన్నదంటూ చాటే ప్రయత్నం చేసింది. ౌ
రెండు రోజులుగా ఈ రాద్ధాంతం ముదురుతోంది. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వైసీపీ ఎంపీలు లోక్ సభలోను పట్టుపట్టడం, ప్లకార్డులు ప్రదర్శించడం వెరసి.. తీవ్రత పెరిగింది. ఈలోగా సాక్షి ఈ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు దొరికాయంటూ.. కొన్ని డాక్యుమెంట్లను ప్రచురించింది. అందులో నారాలోకేష్ సంతకం ఉన్న ఒక భాగాన్ని ప్రచురించారు. ఫైబర్ నెట్ వ్యవహారం చంద్రబాబు పరిధిలోని శాఖ ఆధ్వర్యంలో జరగగా, లోకేష్ సంతకం మాత్రం ఉన్న భాగంతో కథనాలు ప్రచురించారు
సంతకం మాత్రమే ఎందుకు…
నారా లోకేష్ కు ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్నట్లుగా కొన్నాళ్ల పాటు బురద చల్లడానికే వైసీపీ ఇలాంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి కేంద్రం ప్రభుత్వం ఇంటర్నెట్ ఏర్పాటు చేసుకునే బాధ్యతను రాష్ట్రప్రభుత్వాలకే అప్పగిస్తూ.. ఐటీ శాఖల ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకోడానికి ఆహ్వానించింది. కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఎనర్జీ ఐ అండ్ఐ శాఖ ద్వారా పనులు జరిగాయి. ఆ శాఖ చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోనే ఉండిపోయిన శాఖ. తీరా.. కేంద్రం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనుంచి ప్రతినిధుల్ని ఢిల్లీకి ఆహ్వానించింది.
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. ఐటీ శాఖ కార్యదర్శులు ఢిల్లీ వెళ్లి కేంద్రంతో ఆ ఒప్పందంపై సంతకాలు చేయాలి. అందుకోసం.. ఫైల్ కదిలింది. ఐటీ శాఖ కార్యదర్శి ఢిల్లీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మాత్రమే ఫైల్ వెళ్లింది. దానిమీద నారా లోకేష్ సంతకం చేశారు.
అంటే- ఆ సంతకం, తన శాఖ కార్యదర్శి ఢిల్లీ వెళ్లి ఒప్పందం కుదుర్చుకోవడానికే తప్ప.. తాను ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు కాదు. ఈ విషయం ఆ డాక్యుమెంట్ చదివిన ఎవ్వరికైనా అర్థం అవుతుంది.
అయితే వైసీసీ శ్రేణులు మాత్రం బురద చల్లడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకే.. డాక్యుమెంట్ మొత్తాన్ని బయటపెట్టకుండా.. కేవలం లోకేష్ సంతకం ఉన్న భాగాన్ని మాత్రమే బయటపెట్టారు. తాము చూపిస్తున్న డాక్యుమెంట్ లో విషయం లేదని వారికి కూడా తెలుసు.. కానీ, నారా లోకేష్ పేరుతో సంతకం కనిపిస్తున్నది గనుక.. దానిని చూపించి బురద చల్లడం కుదురుతుంది అనుకున్నారు. దాన్నే ప్రచురించి, దాన్నే చూపిస్తూ సీబీఐ తో దర్యాప్తు చేయించాలంటూ.. పార్లమెంటులోను రభస చేశారు. కానీ వాస్తవం వేరు.
ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా అనే విషయం విచారణలో తేలుతుంది. అయితే ఈ వ్యవహారంతో లోకేష్ కు ముడిపెట్టడం మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసినదే అనే అభిప్రాయం ఇప్పుడు అందరికీ కలుగుతోంది.
దృష్టి మళ్లించడానికేనా?
ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతి జరిగిందని జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సమయంలోనే ఎందుకు దానిని రాద్ధాంతం చేస్తున్నారు అనేది ప్రశ్న. అవినీతి ఆరోపణల పరంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. బెంజికారు లంచంగా తీసుకుని మంత్రి జయరాం అడ్డంగా దొరికిపోయారు. ఇసుక ట్రాక్టర్ల దందా నడిపిస్తూ.. అరెస్టు అయిన వారిని విడిచిపెట్టాలని సీఐను నానా రకాలుగా దుర్భాషలాడుతూ.. తాడికొండ ఎంపీ ఉండవల్లి శ్రీదేవి కూడా పార్టీ పరువు తీసేసింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో కొడాలి నాని మాటలు.. ఎంత దుమారంగా మారాయో అందరికీ తెలుసు.
ఇలాంటి నేపథ్యంలో తమ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పుపట్టే అవకాశం ఉంది గనుక.. వారి దృష్టి మళ్లించడానికి వైసీపీ ఇప్పుడే ఈ ఇష్యూను తెరమీదకు తెచ్చినట్లు పలువురు భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారం అయినా సరే.. లోకేష్ పాత్ర ఏమీ లేదని వారికి కూడా తెలిసినప్పటికీ.. సంతకం ఉన్న కొంత భాగాన్ని మాత్రం చూపిస్తూ రాద్ధాంతం చేయడానికి కారణం అదే అని పలువురు అనుకుంటున్నారు.












