నిజమే.. కల్యాణ మండంపం ఉంది. వివాహ వేడుకను వీక్షించి వధూవరులను ఆశీర్వదించేందుకు పెద్ద సంఖ్యలో వారి బంధు గణం మండపం ముందే కూర్చున్నారు. వధువు, వరుడు తల్లిదండ్రులు కూడా మండపంపై కనిపిస్తున్నారు. వేద మంత్రాలు చదివుతున్న పండితుడు కూడా అక్కడే ఉన్నారు. మరి అసలు ఈ వేడుకకు కారణంగా నిలిచిన వధూవరులు మాత్రమే మండపంపై కాదు కదా.. మండపం దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. పూజారి ముందు ఓ కుర్చీ.. దానిపైదేవుడి పటం. మరి అసలు ఈ వేడుకకే కర్తలుగా మారిన వధూవరులు ఎక్కడున్నారు? వారు లేకుండా ఈ వేడుక ఎందుకు? అసలు వీరి ఉద్దేశ్యమేమిటి? ఇలా చాలా ప్రశ్నలే రేకెత్తాయి. అయితే అన్నింటికీ సమాధానం చెబుతూ వధూవరుల తల్లిదండ్రులు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా విదేశంలో ఉన్న తమ పిల్లల పెళ్లిని ఆన్ లైన్‌లో జరిపిస్తున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా జరపాల్సి వస్తోందని చెప్పారు. మొత్తంగా ఇదంతా ఆన్ లైన్ పెళ్లి అన్న మాట.
ఆన్ లైన్ మ్యారేజీ.. అందులోనూ వెరైటీ
ఇదివరకే చాలా పెళ్లిళ్లు ఆన్ లైన్ లోనే జరిగిన తీరు చూశాం. అయితే వాటిన్నింటికీ ఇది భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే.. పెళ్లి వేరే దేశంలో జరిగినా.. వేద పండితుడు అక్కడే కనిపించేవారు. లేదంటే..వేద పండితుడు కూడా ఆన్ లైన్ లోనే ఉంటే.. వధూవరులపేరెంట్స్ వేడకను చాలా సాదాసీదాగా ముగించేసేవారు. అందుకు భిన్నంగా ఈ వేడుక జరిగిందని చెప్పాలి. ఆస్ట్రేలియాలో వధూవరులు ఉంటే.. ఏపీలోని కర్నూలులో వధూవరుల తల్లిదండ్రులు కల్యాణ మండపాన్ని తీర్చిదిద్ది.. బంధువర్గాన్ని ఆహ్వానించి తమ పిల్లల పెళ్లిని ఆన్ లైన్ లో చూపించారు. ఇక వేద పండితుడు కూడా కర్నూలులోని కల్యాణ మండపంలోనే వేద మంత్రాలు చదివారు.
ఈ పెళ్లి వివరాలేంటంటే..?
కర్నూలు జిల్లా గూడురు మండలం గుడిపాడుకు చెందిన రెడ్డిగారి వెంకటరాంరెడ్డి, కవితల పెద్ద కుమార్తె రజిత విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. అదే విధంగా నల్లగొండ జిల్లాకు చెందిన పుట్టా మధుసూదనరెడ్డి, శైలజ పెద్ద కుమారుడు దినేష్ రెడ్డి కూడా రజిత మాదిరే ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. ఆ దేశంలోని డింబోలాలో ఉంటున్న వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి పీటల దాకా వచ్చింది. ఇరువైపు పేరెంట్స్ వీరి పెళ్లికి ఒప్పుకోవడంతో రెండేళ్ల క్రితమే వీరి పెళ్లికి రంగం సిద్ధమైంది. అయితే ఉరుములేని పిడుగులా వచ్చి పడిన కరోనా.. ఎక్కడి వారక్కడే అన్నట్లుగా చేసేసింది. సరే.. కరోనా తగ్గేదాకా వేచి చూద్దాం అంటూ ఇరు వర్గాలు భావించాయి. అయితే పెళ్లి నిశ్చయమై రెండేళ్లు దాటుతున్నా.. ఆస్ట్రేలియాలోని వధూవరులు ఇక్కడికి రావడానికి వీల్లేకుండాపోయింది. వారి తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీలు కాలేదు. ఇక కరోనా ఎప్పుడు నిష్క్రమిస్తుందో తెలియదు. దీంతో టెక్నాలజీని వాడుకుని ఆన్ లైన్ పెళ్లి చేసుకుందామంటూ వధూవరులు భావించగా.. వారి నిర్ణయానికి పేరెంట్స్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే చెప్పేశారు. ఇంకేముంది.. వేద పండితులు నిర్ణయించిన మేరకు ఈ నెల 14న శనివారం ఉదయం 11.45 గంటలకు వీరి పెళ్లి ఆన్ లైన్ లో జరిగిపోయింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.











