‘ద లియో న్యూస్’ మాట అక్షర సత్యమని నిరూపితమైంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ను జగన్ సర్కారు ముఖ్య సలహాదారుగా నియమించింది. అంతేకాకుండా ఈ పదవిలో చేరనున్న ఆయనకు ఏకంగా కేబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) రేవు ముత్యాలరాజు శనివారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నెలాఖరున దాస్ సీఎస్ పదవి నుంచి రిటైర్ కానున్నారు. సాధారణంగా ఏ అధికారిని సలహాదారుగా నియమించాలనుకున్నా.. సదరు అధికారి పదవీ విరమణ చేసిన తర్వాత సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ అధికారి సీఎంకు అత్యంత సన్నిహితుడనుకున్నా.. పదవీ విరమణ చేసిన వెంటనే సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే జగన్ కు దాస్ అత్యంత సన్నిహితుడి కంటే ఎక్కువేనని చెప్పాలి. అందుకే కాబోలు.. దాస్ పదవీ విరమణ చేయడానికి ఐదు రోజుల ముందుగానే జగన్ సర్కారు ఆయనను ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ కేంద్రంగా దాస్ విధులు..
ఇప్పటిదాకా జగన్ సర్కారు నియమించుకున్న సలహాదారులంతా అమరావతి కేంద్రంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పేరిట ఓ ఎంపీని నియమించేవారు. ఆ పదవి దక్కించుకున్న ఎంపీ.. కేంద్ర ప్రభుత్వంతో నిత్యం టచ్ లో ఉంటూ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టేవారు. అయితే ఇప్పుడు జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక.. ఆ పదవిని రద్దు చేసేశారనే చెప్పాలి. కొత్తగా వచ్చే నెల 1 నుంచి ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్న దాస్.. ఢిల్లీ కేంద్రంగానే విధులు నిర్వర్తించనున్నారు. అంటే.. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను దాస్ చక్కబెడతారన్న మాట. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా దాస్ విధులు నిర్వర్తిస్తారని నిన్న రాత్రి జారీ అయిన ఉత్తర్వుల్లో విస్పష్టంగానే చెప్పేశారు.
జగన్ చెబితే దాస్ చేసేస్తారు
ఐఏఎస్ అధికారిగా తన సర్వీసులో జిల్లా కలెక్టర్ గా పలు జిల్లాల్లో పనిచేసిన తర్వాత రాష్ట్ర స్థాయి సర్వీసులకు వచ్చిన తర్వాత దాస్ పలు కీలక శాఖల్లో పనిచేశారు. విద్యాశాఖతో పాటు జలవనరుల శాఖలోనూ దాస్ సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. విద్యా శాఖలో పనిచేసిన కాలం కంటే జలవనరుల శాఖలోనే ఆయన సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. జగన్ సీఎం అయ్యాక జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దాస్.. జగన్ అనుకున్న విధంగా జలవనరుల శాఖను నిర్వహించారు. ఈ కారణంగానే పొరుగు రాష్ట్రంలో విభేదాలు తప్పవని తెలిసి కూడా జగన్ మాటను కాదనలేక రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా దాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు మేఘాకు దక్కేలా వ్యవహరించడంలోనూ దాస్ కీలక భూమిక పోషించారన్న వాదనలు లేకపోలేదు. మొత్తంగా జగన్ ఏం అనుకున్నారో, దానిని చేసి చూపించిన అధికారిగా జగన్ మనసులో దాస్ కు మంచి గుర్తింపు ఉంది.











