‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించి కొత్త వార్త ఒకటి చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా సినిమా కావడమే దీని విడుదలకు ప్రతిబంధకంగా మారింది. ఈ సినిమాకన్నా ముందు విడుదల కావలసిన ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. రాధేశ్యామ్ మాత్రం ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 14న విడుదల చేస్తామని నిర్మాతలు అంటున్నా అది సాధ్యమయ్యేలా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టి నట్టు సమాచారం. అలాంటి ప్రత్యామ్నాయ మార్గం ఓటీటీ తప్ప ఇంకేముంటుంది.
ఓ పక్క కోవిడ్, ఒమెక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మళ్లీ థియేటర్లు మూత పడే పరిస్థితి వస్తే ఏంచేయాలి? ఇదే ఇప్పుడు ఆ నిర్మాతల ముందున్న సమస్య. అందుకే ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తెలుగు స్ట్రీమింగ్ హక్కులు జీ5 వద్ద ఉన్నాయి. ఇలా విడుదల చేయాల్సి వస్తే జీ5 రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. తన మార్కెట్ ను విస్తరించుకునే సువర్ణ అవకాశం జీ5కు దక్కినట్టుగానే భావించాలి.
ఏ ఓటీటీ సంస్థకైనా ఇది సువర్ణ అవకాశమే. ప్రచారం బాగా చేసుకోగలిగితే ఆయా సంస్థలకు కనకవర్షం కురుస్తుంది. ఓటీటీ స్పేస్ లో చొచ్చుకుపోవడంలో ఇప్పటిదాకా జీ5 వెనకబడి ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మాత్రం మంచి బ్రాండింగ్ కుదురుతుంది. ముఖ్యంగా ప్రచారానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా దూకుడును చూపించాల్సి ఉంటుంది. ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం నెట్ ఫ్లిక్స్ వద్ద ఉన్నాయి. ఈ సినిమా విడుదలపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.











