దశలవారీగా నిరసనలు.. వినూత్న రీతిలో ధర్నాలు!
పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులు ఉద్యమం సలుపుతున్నారు. దశలువారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారం రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిసాయి. రిలే నిరాహార దీక్షల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లు, తాలుకా కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ ఒంటెద్దు పొకడను ఎండగట్టారు. పెండింగ్ లో ఉన్న డీఏలతోపాటు పాత జీతమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్రెండీ ప్రభుత్వం అంటూనే ఉద్యోగుల నడ్డి విరుచిందని మండిపడ్డారు. కొత్త పీఆర్సీతో జీతం పెరుగుతుందని దొంగ లెక్కలు చూపించారని, లెక్కల మాస్టార్లకే లెక్కలు నేర్పే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, ఉద్యోగులు ఐక్యతను ఫిబ్రవరి 7న ప్రభుత్వం చూస్తుంది అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నవరత్నాలు అమలు చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్ పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న పీఆర్సీని ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు.
జయలలితకు పట్టిన గతే మీకు పడుతోంది!
2004 లో తమిళనాడులో ఉద్యోగులపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత తీసుకున్న చర్యలు కారణంగా తగిన మూల్యం చెల్లించుకున్నారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగులతో పెట్టుకున్న జయలతి తర్వాత తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయని గుర్తు చేశారు. ఉమ్మడి అంగీకారంతో కొత్త పీఆర్సీని అమలు చేయాలని, ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి పలకాలని నినదించారు. చీకటి జీవోలను వెంటనే రద్దు చేసి, ఐదు డీఏలు కలిపి జనవరి నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్టేసి గెలిపించిన పాపానికి ఇంత అన్యాయం జరుగుతోందని ఊహించలేదని రిలే దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు, మద్దతునిచ్చిన ప్రజా సంఘాల నాయకులు వాపోయ్యారు.
సబ్ ట్రెజరీ కార్యాయానికి తాళం..
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ కార్యాలయానికి పీఆర్సీ సాధన సమితి నాయకులు తాళం వేసి, నిరసన వ్యక్త చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ కార్యాలయంలో సిబ్బంది ఆదివారం జీతాలు ప్రాసెస్ చేస్తున్న విషయం తెలుసుకున్న నాయకులు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. సిబ్బందిని బయటకు పంపి, తాళం వేశారు. ఉద్యోగులపై బలవంతంగా పీఆర్సీని రుద్దితే ఒప్పుకునే లేదని, రివర్స్ పీఆర్సీని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు మిన్నంటాయి.











