ఇల్లేమో ఒకటే.. కానీ అది ఉంటున్న దేశాలు మాత్రం రెండు.. అవే భారత్, మయన్మార్.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసం.. నాగాలాండ్ ఉత్తర భాగంలో మన్ జిల్లాలో లోంగ్వా అనే గ్రామం ఉంది. ఆ గ్రామం భారత్-మయన్మార్ సరిహద్దులో ఉండడం విశేషం. ఇందులో ఇంకా ఆశ్చర్యమనిపించే విషయమేమిటంటే.. ఈ గ్రామం మధ్యలోంచి సరిహద్దు ఉండడం. ఈ గ్రామంలోని ప్రజలు కొందరు మయన్మార్ లో పని చేస్తుంటే.. మరి కొందరు భారత్ లో పనిచేస్తున్నారు. వారికి భారత్-మయన్మార్ రెండూ వారి సొంత దేశాలే. అందుకే ఇరు దేశాలు వారిని గుర్తించి సభ్యత్వం కూడా ఇచ్చారు.
ఇక్కడ అన్నింటికంటే మరొక విచిత్రమైన విశేషం ఒకటుంది. ఆదే ఈ ఊరి పెద్ద ఇల్లు. అతని ఇల్లు కరెక్టుగా సరిహద్దు పైన వచ్చింది. దాని ప్రకారం ఈ ఇల్లు వంటిల్లు భారత్ లో ఉంటే.. పడకగది మయన్మార్ లో ఉంటుంది. అంటే ఈ ఊరి పెద్ద భారత్ లో తిని.. మయన్మార్ లో నిద్రిస్తారనమాట. వినిడానికే విచిత్రంగా ఉంది కదూ. అంతేనా ఒళ్లు గగుర్పొడిచే విషయాలు కూడా ఉన్నాయి. తమ శత్రువులైన ఆది వాసీల తలల నరికేవారట.. వీరి పూర్వీకులు.. అలా చేసిన వారిని పచ్చబొట్టుతో సత్కరిస్తారు. ఇప్పటికీ ఆ కాలం వారి శరీరంపై వేసిన పచ్చబొట్లు వారి వేటకు సాక్షాలుగా నిలిచాయి. కానీ, నేటి తరం వారు అలా కాదు.. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ నాగరికతను అలవరచుకుని.. అటు భారత్.. ఇటు మయన్మార్ లలో వారి జీవనాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు.











