జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. హైకోర్టు మరియు న్యాయవ్యవస్థతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడిందా? అవతలినుంచి సై అనకపోయినా సరే.. ఇవతలినుంచి సై అంటూ కాలు దువ్వడానికే తెగిస్తోందా? అంటే.. పరిణామాలు ఇంచుమించు అలాగే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద విచారణ సందర్భంగా.. శుక్రవారం నాడు హైకోర్టులో ప్రభుత్వం తరఫు ఏఏజీ చేసిన వ్యాఖ్యలు, వాటిమీద న్యాయమూర్తి స్పందన చర్చనీయాంశమే.
వివరాల్లోకి వెళితే..
మిషన్ బిల్డ్ ఏపీ పేరుమీద.. నిధుల సమీకరణ నిమిత్తం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అత్యంత విలువైన భూములను విక్రయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి పాత విషయం. అనేక నగరాల్లో కీలకమైన ప్రదేశాల్లో ఉన్న భూములను కూడా ఈ కేటగిరీ కింద విక్రయించాలని నిర్ణయించారు. అయితే.. ఇలా ప్రభుత్వ ఆస్తులను విక్రయం తగదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలు అయింది. దానిపై శుక్రవారం విచారణ సాగింది.
ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని ఆపివేయాలని కోరుతూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఇతరులు హై కోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాదిగా నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవి తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. హైకోర్టు ఈ కేసును అక్టోబర్ 16 వతేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న అన్నీ విభాగాల ప్రభుత్వ కార్యదర్శులు అన్నీ కేసుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
బురద రాజకీయం : న్యాయపీఠంపై వైసీపీ అక్కసు!
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్న ఏఏజీ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపనికీ అడ్డం తగులుతున్నారు- పరిపాలన వారినే చేసుకోమనండి’’ అని అన్నారు. దీంతో న్యాయ మూర్తి రాకేష్ కుమార్ స్పందించారు.. ‘‘మీరు ఎవరినీ ఉద్దేశించి మాట్లాడారు, హై కోర్ట్ నా! పిటిషనర్ లనా!’’ అని ఏఏజీని అడిగారు.
పార్టీ పదేపదే వాడుతున్న విమర్శ అది
‘‘ప్రతిపనికీ అడ్డు తగులుతున్నారు.. పరిపాలన వారినే చేసుకోమనండి’’ అనే మాట వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ప్రతి చోట వాడుతున్న మాట. ఆ పార్టీకి సంబంధించి చిన్న నాయకుల దగ్గరినుంచి మంత్రులు, ముఖ్యమంత్రుల వరకు కూడా ఇదే వాదన పదేపదే చెబుతూనే ఉన్నారు. ఈ మాటలను వారు- కేసులు వేస్తున్న వారిని అన్నట్లుగా అంటూ.. తెలుగుదేశమే వారి వెనుక ఉండి కేసులు వేయిస్తున్నదని ఆపాదిస్తూ.. పరోక్షంగా న్యాయవ్యవస్థను కూడా ఉద్దేశించి విమర్శిస్తున్నారనే విమర్శలున్నాయి.
అయితే.. రాజకీయ నాయకులు ఇలాంటి మాటలను ప్రెస్ మీట్లలో అనడం చెల్లుబాటు అవుతుంది. అయితే.. బాధ్యత కలిగిన ప్రభుత్వం తరఫు న్యాయవాది.. హైకోర్టులో విచారణ సందర్భంగా.. న్యాయమూర్తుల ఎదుట ఇలాంటి రాజకీయ డైలాగు వేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. రెండు మూడు రోజులుగా న్యాయవ్యవస్థపై వైఎస్సార్ కాంగ్రెస్ విపరీతంగా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో.. ఏఏజీ అన్నమాటలను వెంటనే వదిలిపెట్టకుండా.. న్యాయమూర్తి.. ‘మమ్మల్ని ఉద్దేశించి ఆ మాట అంటున్నారా’ అని ప్రశ్నించడం ఇంకా తీవ్రమైన విషయంగా పలువురు భావిస్తున్నారు.
‘‘హైకోర్టు రాజకీయ వేదిక కాదు ఆనేది మీరు గుర్తుపెట్టుకోండి’’ అని ఏ ఏ జీ కి జస్టిస్ రాకేశ్ కుమార్ సూచించడాన్ని కూడా పలువురు తీవ్రంగా పరిగణిస్తున్నారు.











