కొవిడ్ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల నిర్వహణలో అనేక నిబంధనలు విధిస్తున్నారు. వచ్చే నెల 17 నుండి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి దర్శనం టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతున్నారు.
భక్తులు కొండపైకి చేరుకోవడానికి రవాణా సౌకర్యం కల్పించడం లేదు. ఉత్సవాల్లో భక్తులు కృష్ణా నదిలో స్నానమాచరించి.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈసార నదీ స్నానాలను కూడా అనుమతించడం లేదు. భక్తుల తలనీలాలు ఇవ్వడాన్ని కూడా నిషేధించారు. అలాగే భవానీ భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు లాంటివి కూడా ఉండవు. భవాని భక్తులైనా, సాధారణ భక్తులు అయినా ఆన్లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే. మొదటి రోజు ఉదయం 9 గంటలు నుండి రాత్రి 8 గంటలు వరకు మిగిలిన రోజులు ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుందని ఈవో సురేష్ బాబు తెలిపారు.
దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి రోజుకి 10 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు. మూలా నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత దర్శనానికి 4వేల టికెట్ లు కేటాయించారు, 3 వేల టికెట్ లు 100 రూపాయలు, 3వేల టికెట్ లు 300 రూపాయలకు కేటాయించారు. టైం స్లాట్ ప్రకారం దర్శనానికి వచ్చిన భక్తులను మాత్రమే అనుమతిస్తారు. 5 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు దర్శనానికి అనుమతి లేదు.
వినాయక ఆలయం నుండి ఘాట్ రోడ్ మీదుగా క్యూ లైన్ ద్వారా భక్తులు నడిచి రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే. మాస్క్ లేని వారిని దర్శనానికి అనుమతించరు.
ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు
వివిధ రోజుల్లో అమ్మవారి అలంకరణ విశేషాలివే..
అక్టోబర్ 17 న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
19న శ్రీ గాయత్రీ దేవి
20 న శ్రీ అన్నపూర్ణాదేవి
21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి
22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
23 న శ్రీ మహాలక్ష్మీ దేవి
24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలు
25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం…
అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరుగుతుంది.











