ఆచార్య సినిమా కథపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని చిత్రయూనిట్ అంటోంది. ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా ఒరిజినల్ కథ, కాన్సెప్ట్ దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చెందుతుందన్నారు. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన హైప్ చూసి కొందరు రచయితలు ‘ఆచార్య’ సినిమా కథ తమదంటూ తమదంటూ ఆరోపణలు చేశారు.
‘సినిమా చిత్రీకరణ జరుగుతుండటం వల్ల సినిమా కథను రహస్యంగానే ఉంచాం. చాలా తక్కువ మందికి మాత్రమే కథ గురించిన అవగాహన ఉంది. కేవలం మోషన్ పోస్టర్‌ను చూసి ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం. అందరికీ చెప్పాలనుకున్న విషయమొక్కటే.. ‘ఆచార్య’ కథ ఒరిజినల్. కొరటాల శివలాంటి పేరున్న దర్శకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ‘ఆచార్య’ సినిమా గురించి వస్తున్న పుకార్లు ఆధారంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.
ఈ కథపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి, ఈ కథ కోసం మెగాస్టార్‌తో కొరటాల శివ రెండేళ్ల పాటు ట్రావెల్ అయ్యారు. ఆయన ఇమేజ్‌కు తగినట్లు పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ‘ఆచార్య’ సినిమా కథను సిద్ధం చేశారు’అని ఆ ప్రకటనలో వివరించారు.ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉందని, ఈ సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చిత్రయూనిట్ తెలిపింది.
అసత్య ఆరోపణలు: మైత్రీ మూవీస్
‘ఆచార్య’పై రాజేష్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు అసత్యమని, మేము అతని కథకు అన్నయ్య అనే పేరు పెట్టాలని కొరటాల శివకు తెలియజేశామని చెప్పడం అబద్దమని, అతని ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నమని తెలియజేసింది మైత్రిమూవీ మేకర్స్ సంస్థ. ‘గతంలో మేము నూతన దర్శకులలో డియర్‌కామ్రేడ్ (భరత్‌కమ్మ), మత్తువదలరా (రితేష్‌రానా), ప్రస్తుతం ‘ఉప్పెన’ (బుబ్చిబాబు సానా) సినిమాలను నిర్మించాం. రాజేష్ మాకు వినిపించిన కథ బాగుంటే అతనితో కూడా సినిమా నిర్మించేవాళ్లం’ అని పేర్కొంది.
కథ బాగాలేకపోవడంతో అతని కథను తిరస్కరించామని చెప్పింది. ఇక బాగోలేని కథతో వేరే వారికి సినిమా నిర్మించాలని ఎందుకు చెబుతాం? దర్శకుడిగా, రచయితగా కొరటాల శివ ప్రతిభ గురించి అందరికి తెలుసు. కమర్షియల్ అంశాలతో పాటు తన ప్రతి సినిమాలో సామాజిక ప్రయోజనం కూడా జోడించే కొరటాల శివ గారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అర్థరహితమైన ఆరోపణలు చేయడం సరికాదు.మీడియాలో రాజేష్ చేసిన ఆరోపణలు ఖండించడంతో పాటు ఆయనపై తగిన చర్చలు తీసుకుంటాం. రాజేష్ చేసిన చౌకైన జమ్మికులను అతని ఆరోపణలను అందరూ విస్మరించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.












