నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ సీఎంఓ ఉన్నతాధికారి ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పై సంచలన కామెంట్స్ చేశారు. తనపై సీబీఐ కేసు వేయించేలా చేసింది సీఎం జగన్ కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాశ్ అంటూ రాజు గారు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థికశాఖలో ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్ మేట్ ఉన్నారు. ఆయన ద్వారానే ఈ కేసు వేయించారని వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులతో తాను భయపడనని స్పష్టం చేశారు. సీబీఐ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? అసలు ఈ కేసు ఏంటనే విషయాలపై ఇవాళ రాజు గారు ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
వ్యాపార నిమిత్తం పలు బ్యాంకుల నుంచి పొందిన నిధులను దారి మళ్లించారని రఘురామపై పంజాబ్ నేషనల్ బ్యాంకు సీఈఓ సునీల్ మెహతా ఫిర్యాదు చేయడం ఆ ఫిర్యాదుపై రంగంలోకి సీబీఐ ఏకకాలంలో రాజుగారికి చెందిన 11 సంస్థలపై దాడులు నిర్వహించారు. 826 కోట్లకు పైగా అవకతవకలు జరిపినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
రఘురామ వివరణ
సీబీఐ దాడుల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు. తనపై అనర్గత వేటు వేయించలేని వారు ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. తాను 4000 కోట్ల వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు వెల్లడించారు. 2000 కోట్ల వరకు ఇంకా బ్యాంకు ఖాతాలోనే ఉన్నాయని పేర్కొన్నారు. తన వ్యాపారాలలో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు. ఒకవేళ నిధులను దారి మళ్లిస్తే ప్రాజెక్టులు ఎలా కట్టామని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ సీబీఐ తనను విచారిస్తే ఆధారాలతో సహ రుజువు చేస్తానని ధీమాని వ్యక్తం చేశారు.
సాక్షి, జగన్ పై పరోక్ష విమర్శలు
సాక్షి పత్రిక, ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఓ పత్రిక తాను బ్యాంకులకు రూ.23 వేల కోట్లు ఎగవేశానంటూ రాసిందని దీంతో ఆ పత్రిక విశ్వసనీయత పడిపోయిందని వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. వాళ్లపై 43 వేల కోట్ల కేసులు ఉండటంతో తనపై 23 వేల కోట్ల కేసులు వేశారంటూ ఎద్దేవా చేశారు. ఇలా రాసిన పత్రికపై కేసులు వేయాలంటూ తమ లాయర్లు కోరారని కానీ మరో మూడ్నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే వారిపై మరో కేసు వేయడం ఎందుకుని ఆగిపోయానని పేర్కొన్నారు.
అమికస్ క్యూరీ సిఫారసులతో సుప్రీం ప్రజాప్రతినిధులపై కేసులను వేగవంతం చేయాలని ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ ను ఉద్దేశించి రఘురామ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. అక్టోబర్ 5న సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలోనే తనపై కేసు నమోదు చేశారని రాజు గారు చెప్పుకొచ్చారు. అదే రోజున సీఎం జగన్ ప్రధాని మోడీని కలవడం, పంజాబ్ నేషనల్ బ్యాంకు చైర్మన్ సీఎం జగన్ ను కలవడం అనుమానాలు కలిగిస్తోందని పేర్కొన్నాడు.