భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్, ప్రముఖ నటి విజయశాంతి సీఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెట్టారు. జంట నగరాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలు ప్రజల్ని ఎప్పుడూ లేనంత నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయడం కళ్లారా చూశామని విచారాన్ని వ్యక్తం చేశారు. వీధుల్లో వరదనీరు కాలువల్లా పారిందని, రోడ్లపై ఏరులా ప్రవహించిందని తెలిపారు. ఈ దౌర్భాగ్యానికి గత పాలకులే కారణమని సీఎం కేసీఆర్ దొరగారు ఎన్నోమార్లు నినదించారని విజయశాంతి విమర్శించారు.
ప్రకృతిని నియంత్రించడం ఎవరి వల్ల కాదని, అయితే, చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి రక్షించేందుకు గడచిన ఆరేళ్ల పరిపాలన కాలంలో సీఎం కేసీఆర్ ఏంచేశారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ఏ కాస్త అయినా చిత్తశుద్ధితో సేవ చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని విమర్శించారు. కేసీఆర్ సరైన పాలన అందించి ఉంటే ప్రజలు తక్కువ ఇబ్బందులతో గట్టెక్కేవాళ్లని తెలిపారు. సర్కారు పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పాలనా కాలంలో ఇలాంటి పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో కేసీఆర్ తనను తాను ప్రశ్నించుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు.
“టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో చెరువుల దురాక్రమణలు, భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు చోటుచేసుకున్నాయని కేసీఆర్ అనేక పర్యాయాలు అన్నారు. దాని వల్ల జరిగిందేమిటి? మీరైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయగలిగారా? మీ నిర్వహణ ఏ తీరున ఉందో జలగండంలో చిక్కుకుపోయిన మీ కలల విశ్వనగరాన్ని చూస్తే చాలు” అని విజయశాంతి టీఆర్ఎస్ సర్కార్ కు చురకలు అంటించింది.
జంటనగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన భారీ వర్షాలు ప్రజల్ని ఎప్పుడూ లేనంత నిస్సహాయ పరిస్థితుల్లోకి నెట్టివేయడం కళ్ళారా చూశాం. వరదనీరు కాలువల్లా పారని వీధి, ఏరులై ప్రవహించని రోడ్డు లేదు. దశాబ్దాల ఈ దౌర్భాగ్యానికి గత పాలకులే కారణమని సీఎం కేసీఆర్ దొరగారు ఎన్నోమార్లు నిందించారు.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 16, 2020











