కన్నా లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లగానే కన్నా లక్ష్మీనారాయణ కమలదళంలో చేరిపోయారు. అక్కడ ఆ పార్టీకి ఎలాంటి బలం లేదని తెలిసినా… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదా మన హవా ఉంటుంది లే అని అనుకున్నారో ఏమో కాని భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.
అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారని, అయితే ఆ పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇందంతా అప్రస్తుతమే కాని కన్నా రాజకీయం అలా తిరిగి తిరిగి కమలం గూటికి చేరింది. ఆ తర్వాత అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకీ మధ్య రోజురోజుకు వైరం పెరగడం, బీజేపీకి కాపు కాసే నాయకుడు కావాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులయ్యారు.
ఇది ఆ పార్టీ వారికే కాదు… ఇతర రాజకీయ పార్టీలకు, రాజకీయాలను నిశితంగా వపరిశీలించే వారికి ఊహించని నియామకం. రాజకీయాలు తప్న సిద్ధాంతాలు లేని కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ సిద్ధాంతాలే ప్రాతిపదికగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కావడమే ఇందుకు కారణం. సరే, బీజేపీ ప్లాన్ ఏమిటో కాని కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. తొలి రోజుల్లో రాష్ట్రం అంతా పర్యటించి పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసారు పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి నాయకత్వ స్థాయికి ఎదిగిన వారు అధ్యక్ష పదవి రాలేదని కినుక వహించారు. అది మొదలు అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సహకారం లభించలేదంటారు.
ఏపీ ప్రభుత్వంపై రుసరుసలు…
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. ప్రతీ పనినీ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రంతో సఖ్యంగా ఉన్న ఏపీ ప్రభుత్వంపై తమ అధ్యక్షుడు విరుచుకుపడడం అధిష్టానానికి మింగుడు పడలేదంటారు. ఈ కారణంగానే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారమూ జరిగింది. సరే, అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించింది అధిష్టానం. ఆయన పదవీ ప్రమాణ స్వీకారం రోజు కనపడిన మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మళ్లీ ఇప్పటి వకరూ అయిపూ, జాడ లేకుండా పోయారని అంటున్నారు. అంటున్నారు కాదు… నిజంగానే ఈ మద్య కాలంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కవిగా మారిపోయారా అంటున్నారు. కవి అంటే కవిత్వం రాయడం కాదు… కనిపించడం లేదు… వినిపించడం లేదు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక్క విలేకరుల సమావేశం కాదు కదా… కనీసం పత్రికా ప్రకటన కూడా చేయలేదు కన్నా లక్ష్మీనారాయణ. దీంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నావు “కన్నా”.. వెతుక్కుంటున్నారట. పార్టీ కూడా ఈ మధ్య ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, అయినా మాజీ అధ్యక్షుడి అయిన ఆరు నెలలలోపే ఇలా వైరాగ్యమా అని చర్చించుకుంటున్నారు.











