విశాఖలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక హైలీ ఎడ్యుకేటెడ్ దొంగను పోలీసులు పట్టుకున్నారు. గాజువాకలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు కాస్త ఫోకస్ పెట్టారు. వారి ప్రయత్నం ఫలించి.. సీరియల్ దొంగ వినోద్ రాజును అరెస్టు చేశారు. విచారణలో మాత్రం వారికి విస్తుపోయే విషయాలు తెలిశాయి.
వినోద్ రాజు తెలివైన కుర్రాడే. ఎంబీయే చదివాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో చిల్లర ఖర్చుల కోసం పక్కదారి పట్టాడు. చేతివాటాన్ని నమ్ముకోవడమే అతడికి ఉత్తమంగా అనిపించింది. యుట్యూబ్ లో చూసి దొంగతనాలు ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు. అంతకాలం కాలేజీల్లో చదువుకున్న చదువులు అతనికి ఉపయోగపడలేదు గానీ.. యూట్యూబ్ వీడియో లెసన్స్ ద్వారా నేర్చుకున్న పాఠాలు లాభసాటిగా అనిపించాయి. సదరు నడింపల్లి వినోద్ రాజు అదే తరహాలో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు.
నిరుద్యోగానికి తోడు. అప్పుల పాలవ్వడంతో దొంగతనానికి అలవాటు పడ్డట్టుగా వినోద్ రాజు పోలీసులకు చెప్పాడు. వినోద్ రాజు నుండి ఐదు కేజీల వెండి, ఐదు తులాల బంగారం, 8 కంప్యూటర్లు 10 మోనిటర్లు, 1 కేనాన్ కెమెరాలు, పలు స్కూటీలు పోీలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కుర్ర దొంగల్లో ఎడ్యుకేటెడ్ ఎక్కువ
చదువూ సంధ్యా లేని వాళ్లు దొంగలుగా మారడం పాత రోజుల్లో పద్ధతి. ఈ తరంలో దొంగలుగా మారుతున్న కుర్రాళ్లందరూ బాగా చదువుకున్న వాళ్లే. నగరాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వారు, చిల్లర దొంగతనాలు చేస్తున్న వారు చాలా మంది ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు గానే తేలుతుండడం విశేషం. విలాసాలకు అలవాటు పడడం, సరైన సమయంలో ఉద్యోగాల్లో కుదురుకోకపోవడం దొంగలుగా మారడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.