అన్నో.. నువ్వు వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఎన్నికల ముందు హామీలు ఇచ్చావు. మరి అధికారంలోకి వచ్చిన 3 నెలలకే మా కడుపు కాలేటట్లు చేశావు కదా అన్న.. అంటూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు 104 వాహనాల సిబ్బంది.
అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి.104 వాహనాల్లో విధులు నిర్వహిస్తున్న 1058 మంది సిబ్బంది జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు నిజంగానే మారతాయన్న భ్రమలో ఓట్లు వేసి మరి గెలిపించుకున్నారు. అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్లుగా సారు అధికారంలోకి వచ్చిన 3 నెలలకే వాళ్ల ఆశలు మీద నీళ్లు చల్లేసింది వైకాపా ప్రభుత్వం.
కూలికి వెళ్తూ.. బతుకు పోరాటం
104 వాహనాలనే నమ్ముకుని 11 ఏళ్ల పాటు గ్రామాల్లో సేవలు అందించిన సిబ్బంది ఇప్పుడు కుటుంబ పోషణ కోసం దినసరి కూలీలుగా మారారు. ఏపీలో 2008లో ప్రారంభమైన 104 సేవల నిర్వహణ బాధ్యతను 2014 వరకు ప్రభుత్వమే తీసుకుంది. 2014 తర్వాత టెండర్లను దక్కించుకొన్న పిరామిల్ సంస్థ మొత్తం బాధ్యతలను తీసుకుంది.
బాధ్యత మారింది… సిబ్బంది తగ్గారు..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టు దక్కించుకొన్న అరబిందో సంస్థ వెంటనే 104 వాహనంలో ఉండే సిబ్బందిని తగ్గించింది. వాహనంలో ఒక డ్రైవర్, వైద్యుడు , డీఈవోను మాత్రమే ఉంచింది. గత ప్రభుత్వం తెదేపా హయంలో 104 వాహనంలో ఒక వైద్యుడు, ల్యాబ్ టెక్నిషయన్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం, వాచ్ మెన్ ఉండేవారు.
సీఎం హామీ ఇస్తే మాకేం సంబంధం
అధికారంలోకి రాగానే 104 ఉద్యోగుల సంఘం నేతలు సీఎం జగన్ ను కలిసి తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని కోరారు. కొత్త సంస్థలకు వాహనాల బాధ్యతలు అప్పగించడం వల్ల 1058 మంది రోడ్డున పడతారని సీఎంకు వివరించారు. స్పందించిన సీఎం జగన్… 1058 మంది ఉద్యోగుల్ని పీహెచ్ సీలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘ఇది నాన్నగారు ప్రారంభించిన పథకం. 108,104 వాహనాల పథకాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ’అని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఆ హామీ అమలులోకి రాలేదు. పైగా సీఎం హామీ ఇస్తే మాకేం సంబంధం అన్న సమాధానాలు ఆరోగ్యశాఖ నుంచి వినిపించాయి. ఇటీవల ఆరోగ్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో కూడా వారికి ఎటువంటి ప్రత్యేక వెయిటేజీ లేదు. దీంతో 104 సిబ్బందిలో కేవలం 256 మందికి మాత్రమే ఉద్యోగాలు రాగా…మిగిలిన 799 మంది ఖాళీగా ఉన్నారు.
జీతాలు పెంచుతుంది అనుకుంటే.. రోడ్డున పడేసింది
కొన్నేళ్లపాటు 104 వాహనంలో విధులు నిర్వర్తించాను. మా సేవలు గుర్తించి ప్రభుత్వం మాకు జీతాలు పెంచుతుందనుకుంటే రోడ్డున పడేసింది. కుటుంబ పోషణ కోసం తప్పని సరి పరిస్థితుల్లో కూరగాయల కొట్టు పెట్టుకోవాల్సి వచ్చిందంటూ ఓ ఫార్మసిస్టు తన ఆవేదన తెలిపారు.
రోజు కూలికి వెళ్లాల్సి వస్తుంది
104 వాహనంలో ఉద్యోగం పోవడంతో జీవనం కష్టంగా మారింది. జీవనం కోసం బట్టల షాపులో రోజు కూలిగా పని చేస్తున్నాన్నంటూ మరో ఫార్మసిస్టు తన బాధను తెలిపారు.
సీఎం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మమ్మల్ని పీహెచ్ సీల్లోకి తీసుకుంటే బాగుంటుందంటూ ఓ ఏఎన్ఎం అన్నారు.











