కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. జయాజయాలతో సంబంధం లేకుండా.. సరికొత్త చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేస్తుంటాడు. తెలుగు లో కూడా అతడి ఇమేజ్ అతదే తరహాలో సాగుతోంది. ఈ నేపథ్యంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘సురారై పోట్రు’ తమిళ సినిమా.. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ గా విడుదలవుతోంది. ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. నిజానికి ఈ నెల 30న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవ్వాలి కానీ.. ఏవో కారణాలతో విడుదల తేదీని నవంబర్ 12కి మార్చారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘ఆకాశం నీహద్దురా’ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత చరిత్రను తెరపై చాలా ఆసక్తికరంగా ఆవిష్కరించినట్టు అర్ధమవుతోంది. ‘వ్యవసాయం చేసేవాడు విమానం ఎక్కుతాడు’ అనే డైలాగ్ తో సామాన్యుడికి సైతం విమానం ఎక్కే సౌకర్యం కల్పించినట్టు తెలుస్తోంది. అలాగే.. నాలుగు కోట్లతో విమానం కొని.. సామాన్యుడికి కూడా విమానం ఎక్కేందుకు అవకాశం కల్పిస్తూ.. టికెట్ ధరను 1రూపాయిగా నిర్ణయించడం గోపీనాథ్ వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. సామాన్యుడిచేత విమానయానం చేయించేందుకు సూర్య పాత్ర ఎన్ని కష్టాలెదుర్కొందో ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు దర్శకురాలు సుధ. మల్లూ కుట్టి అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో.. మోహన్ బాబు పాత్ర మరో హైలైట్ కానుంది.