జగన్ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఢిల్లీని తాకాయి. మట్టి తవ్వకాలు, మైనింగ్ ఇలా ఏ ఒక్కదాన్ని వదల్లేదు. తాజాగా జగన్ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. పోలీసుశాఖలో విధులు నిర్వర్తించేందుకు శిక్షణ పొందే జాగిలాలలకు పెట్టే ఫుడ్ విషయంలోనూ కొందరు అధికారులు కక్కుర్తి పడ్డారు. నిధుల స్వాహాకు తెరలేపారు. నాణ్యత లేని ఆహారాన్ని కొని వాటి ఆరోగ్యం దెబ్బతినడానికి కారకులయ్యారు. అంతే కాదు.. కుక్క పిల్లల కొనుగోలు, ఎంపికలోనూ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలోనే బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది రాష్ట్రప్రభుత్వం. వారిపై అభియోగాలు మోపింది. ఈ మేరకు హోంశాఖ ఇన్‌ఛార్జి ముఖ్యకార్యదర్శి జి.విజయ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎచ్చెర్ల APSP బెటాలియన్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న టి.శ్రీనివాసరావు 2012 ఫిబ్రవరి నుంచి 2023 మే 3 వరకూ రాష్ట్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుల్లోని డాగ్ స్క్వాడ్ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వర్తించారు. శిక్షణకు అనువైన జాగిలాల ఎంపిక, వాటి కొనుగోలు బాధ్యతలు చూసేవారు. ఆయన 35 కుక్క పిల్లల్ని నిబంధనలు పాటించకుండా కొన్నారు.నాసిరకమైన, నిర్దేశిత ప్రమాణాలు లేని ఆహారాన్ని కొని వాటికి పెట్టేవారు. అందులో 8 రకాల పదార్థాలు నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అప్పట్లో శిక్షణ పొందుతున్న కుక్క పిల్లల ఆరోగ్యం దెబ్బతింది.
ఆరు కుక్క పిల్లల్ని శిక్షణ నుంచి తప్పించి.. కొత్తవి తీసుకొచ్చి పెట్టారు. ఇలా చేయాలంటే.. హ్యాండ్లర్ల రిక్వెస్ట్ లెటర్, ఇన్‌స్ట్రక్టర్ల అభిప్రాయం, వెటర్నరీ వైద్యుల సర్టిఫికేషన్, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ అవేవీ పాటించలేదు. దీని వల్ల కొత్తగా తీసుకొచ్చిన కుక్క పిల్లలకు వ్యాక్సినేషన్, ఆహారం వంటి వాటి ఖర్చులకు అదనంగా బడ్జెట్ వెచ్చించాల్సి వచ్చింది. శిక్షణకూ జాప్యం జరిగింది.ఈ వ్యవహారమంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 జనవరి 28 నుంచి 2023 ఏప్రిల్ 24 మధ్య ఇది జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో పాటు అప్పట్లో ISW విభాగం ఎస్పీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కె.సూర్యభాస్కర్‌రెడ్డిపైనా ప్రభుత్వం అభియోగాలు మోపింది.
ఆయిల్‌ను వదల్లేదు –
ISWలోని పోలీసు వాహనాలకు కొట్టే ఆయిల్‌నూ పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2022 మే నుంచి 2023 ఏప్రిల్ మధ్య 8 వాహనాలకు 4,093 లీటర్ల పెట్రోల్ వినియోగించినట్లు రికార్డుల్లో చూపించి నిధులు డ్రా చేసుకున్నారు. ఆ కాలవ్యవధిలో ఆ వాహనాలు అసలు తిరగనేలేదు. అప్పట్లో ISW మోటారు ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో DSPగా పనిచేసి.. ప్రస్తుతం పీటీవో డీఎస్పీగా ఉన్న డి.కోటేశ్వరరావు, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఆర్‌ఎస్సైగా పనిచేస్తున్న ఎం.సతీష్‌కుమార్, కాకినాడ బెటాలియన్‌లో RSI ఎం.కృష్ణను దీనికి బాధ్యులుగా ప్రభుత్వం పేర్కొంది. ఐఎస్‌డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేసిన కె.సూర్యభాస్కర్‌రెడ్డి పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఆయన ఇద్దరు SPF కానిస్టేబుళ్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగాలు మోపింది.