ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినందుకుగానూ ట్రంప్ పేరును నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెడ్డే నోబెల్ శాంతి పురస్కారానికి ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయడం విశేషం. అయితే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ పేరును జెడ్డే ప్రతిపాదించడం ఇది తొలిసారేం కాదు. అయితే అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని తన పేరును నామినేట్ చేయడం ట్రంప్‌కు కాస్త కలిసొచ్చే అంశంగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. 2009లో ఆయనకు నోబెల్ శాంతి బహుమానం దక్కింది. అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తూ ప్రపంచ శాంతి కోసం పని చేసినందుకు గానూ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ముందే వ్యాక్సిన్ తీసుకొస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై దుమారం ఇప్పటికే రేగుతోంది. ఎన్నికలకు సిరిగ్గా రెండు రోజుల ముందు నవంబర్ 1న కరోనాకు వ్యాక్సిన్ తీసుకొస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రంప్ గతంలో లేఖలు కూడా రాశారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాట్ పార్టీ స్పందిస్తూ దీనిని ఎన్నికల గారడీగానే చూడాలని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ కావడం ట్రంప్‌కు ఎంతవరకు కలిసివస్తుందో వేచిచూడాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.