ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులు మార్కెట్ యార్డుల నుంచి, దళారీల నుంచి, రైతులను విముక్తుల్ని చేసి, దేశంలో ఎక్కడైనా తమ పంటను అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తుందని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. మరోవైపు చిన్న,సన్నకారు రైతులకు తమ పంటను ఇతర ప్రాంతాలకు సరే, సమీప పట్టణాలకు తీసుకెళ్లే స్థోమత కూడా ఉండదని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది చివరకు దళారుల స్థానంలోకి జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నాయి. మార్కెట్ యార్డుల బదులు ఆన్ లైన్ విక్రయ స్థలాలు రంగ ప్రవేశం చేస్తాయని కూడా విమర్శకులు అంటున్నారు. కరోనా కల్లోలం ఈ ధోరణిని ఇప్పటికే వేగవంతం చేసింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్చువల్ విపణి (ఈ-నాం) ద్వారా కూడా రైతులు, మార్కెట్ యార్డుల్లో కొంత అమ్మకాలు జరుపుతున్నారు. కానీ, ప్రైవేటు ఆన్ లైన్ సంస్థలకు దీటుగా నిలబడటానికి కావలసిన వెన్నుదన్ను సర్కారు నుంచి ఈ-నాంకు లభించడం లేదు. గత మే నెల మొదటి వారానికే దేశమంతటా 1,66,000 మంది రైతులు ఇంటి గడప దాటకుండా తమ ఉత్పత్తులను అమ్ముకున్నారనీ, దేశంలోని 1,500 ప్రధాన సరకుల మార్కెట్ యార్డులలో సగభాగం ఈ-నాంలో పాలు పంచుకుంటున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.
కానీ, కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ అంచనా ప్రకారం దేశంలోని 6,900 ఏపీఎంసీలలో కేవలం 1000 మాత్రమే ఈనాంలో చేరాయి. ఈనాం లోపాలను సరిదిద్ది పకడ్బందీ డిజిటల్ వేదికగా రూపొందించకపోవడం వల్ల రైతులు కార్పొరేట్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తుందని ప్రతిపక్షాల ఆందోళన.
రానున్న అయిదేళ్లలో ఆన్ లైన్ లో ఉప్పులు, పప్పులు, బియ్యం, గోధుమల విక్రయాలు 20 రెట్లు పెరుగుతాయని అంచనా. అయితే రైతులు వ్యక్తిగతంగా ఆన్ లైన్ అమ్మకాలు సాగిస్తే గరిష్టంగా లబ్ది పొందలేరు. సంఘాలుగా ఏర్పడితేనే అది సాధ్యం. అది చిన్నసన్నకారు రైతులకు అలవికాని పని. దీనివల్ల వారు ప్రైవేటు ఈ-కామ్ సంస్థలను ఆశ్రయించాల్సి రావచ్చు. భారతదేశపు ఆన్ లైన్ కిరాణా అమ్మకాలు లేదా ఈ-కామర్స్ ఏటా 27 శాతం చొప్పున పెరుగుతూ 2024కల్లా 9,900 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 7 లక్షల కోట్ల) వ్యాపారంగా ఎదుగుతుందని గోల్డ్ మాన్ శాక్స్ అంచనా. అందులో సగ భాగాన్ని ఫేస్ బుక్-వాట్సాప్ ద్వారా రిలయన్స్ సంస్థే చేజిక్కించుకొంటుందనీ లెక్కగట్టింది.
మరోవైపు వాల్ మార్ట్ ఇండియా చిల్లర అమ్మకాల విభాగంలో 25 శాతం సరకులను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తానని ప్రకటించింది. భారతీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ సంస్థ కూడా భారతీయ ఆన్ లైన్ కిరాణా వ్యాపారంలో అగ్రగామి సంస్థగా నిలుస్తోంది. ఈ భారీ ఈకామర్స్ సంస్థలతోపాటు అనేకానేక ప్రైవేటు కొనుగోలుదారులు కూడా రైతుల నుంచి చవకగా సరకులు కొని నిల్వ చేసి అధిక దరలకు అమ్ముకునే అవకాశాలు పుష్కలం. రైతులు రానురానూ ప్రైవేటు సంస్థల గుప్పిట్లోకి వెళ్లిపోతారని భయాలు ఉన్నాయి.
చిన్న, సన్నకారు రైతులకు భారీ కార్పొరేట్లు ఆడమన్నట్లు ఆడే దుస్థితి ఏర్పడుతుందనీ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వ మండీలు లేదా మార్కెట్ యార్డులనూ యథాతథంగా కొనసాగిస్తామనీ, ప్రైవేటు కొనుగోలుదారులకు అమ్మడం ఇష్టంలేని రైతులు మండీలకు రావచ్చని ప్రభుత్వం చెబుతోంది. అది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో తెలియదు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులు శాసించినట్లయితే రైతుల ఆదాయాలు పెరగడం పోయి, తగ్గిపోతాయని ప్రపంచంలో పలు దేశాల్లో నిరూపితమైంది. ఇలాంటి చేదు అనుభవాలు భారతీయ రైతులకు దాపురించకుండా చూడటానికి ప్రభుత్వం తన బిల్లుల్లో తగు ఏర్పాట్లు చేయలేదని రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని అందరూ ఒప్పుకుంటున్నా, కొత్త బిల్లులతో ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
– అర్జున్











