తెలుగు తెరపై హస్యపు జల్లు అల్లు అనే నానుడి కొన్నేళ్లుగా ఉంటూనే ఉంది. ఆయన మన మధ్య లేకున్నా ఆయన వదిలిన పదాలు, బాడీ లాంగ్వేజి మనకు మరవలేని జ్ఙాపకాలు. ఆయన నటించే ప్రతిపాత్రా ఆయనకే స్వంతమా అనే రీతితో నటించి నవ్వించిన ఘనాపాటి పద్మశ్రీ అల్లు రామలింగయ్య. హాస్యానికి ఆయనే చిరునామాగా మారారు. నటనలో హాస్యానికి పెద్ద పీట వేశారు.. కాని.. ఏ పాత్రలోకైనా పరకాయప్రవేశం చేసి మెప్పించగలనని నిరూపించారు. అందుకు శంకరాభరణం సినిమానే ఉదాహరణ. కామెడీ పాత్రలు, పక్క పాత్రలతో రొమాంటిక్ కామెడీ చెయ్యటం, బాధ్యత కలిగిన తండ్రి పాత్రలు, విలన్ పక్కన ఉండే కామెడీ విలన్ పాత్రలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. విలన్ పాత్రలు, స్నేహితుడి పాత్రలు, జమిందారు పాత్రలు, బంట్రోతు పాత్రలు, పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఇలా ఒకటేమిటి సమాజం లో కనిపించే ప్రతి పాత్రనూ ఆయన చేశారు. వాటికి జీవం పోశారు.
అలాగే దర్శకుల, రచయితల పెన్ను నుంచి జాలువారిన ప్రతి ఊహాజనిత పాత్రలకు కూడా ప్రాణం పోసిన మహనటుడు అల్లు రామలింగయ్య. ఆయన 1000కి పైగా చిత్రాల్లో చివరి దాకా నటించి సినిమా పై తన ప్రేమని ఛాటుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ. ఎక్కువ చిత్రాల్లో నటించి సినీ జగత్తులో చాలా మంది నటీనటులకి మార్గదర్శకుడయ్యారు. నటనకి నిలువెత్తు రూపం అల్లు రామలింగయ్య. తెలుగు సినిమా చరిత్రలో ఉన్న గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామలింగయ్య పాత్రలు ఉండటం విశేషం. హోమియోపతి డాక్టర్ గా పలు సేవలు అందించారు, తరువాత తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ఎంత బిజీ గా ఉన్నా కూడా తన వృత్తి హోమియోపతి ని మాత్రం వదల్లేదు.
వీలున్నప్పుడల్లా సినిమా నటీనటులకి కూడా తన వైద్యాన్ని అందించారు. నిర్మాత గా మారి గీతా ఆర్ట్స్ బ్యానర్ స్టాపించి అనేక సూపర్‌హిట్స్ అందించారు. అలాంటి మహనటుడు, నిర్మాత శ్రీ అల్లురామలింగయ్య గారు పుట్టినరోజు అక్టోబర్1 కావటం విశేషం అయితే ఈ సంవత్సరం పుట్టినరోజుకి మరో ఘనత ఉంది. ఆయన 99వ పుట్టినరోజు కావటం 2021లో 100 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ఓ కార్యక్రమంలో ఆయన కుమారుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘మా నాన్న అల్లు రామలింగయ్య తర్వాత నేను, నా తర్వాత మా అబ్బాయిలు ఈ సినిమా పరిశ్రమలోకి వచ్చాం. ఈ మధ్య నేను ఎయిర్‌పోర్ట్ కు వెళితే అక్కడ ఒకావిడ నన్ను చూసి నమస్కారం అరవింద్ గారూ అంటూ పలకరించింది. అక్కడే ఉన్నవాళ్ళ అమ్మకి అల్లు రామలింగయ్య గారి అబ్బాయి అని పరిచయం చేసింది. నాన్నగారు తరతరాలకు మా ఫ్యామిలీకి ఆ గుర్తింపునిచ్చారు’ అని పేర్కొన్నారు.











