సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయ బిల్లుకు నిరసనగా పార్టీ నేతలతో కలిసి ఆయన సంగారెడ్డిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో మాణికం ఠాగూర్, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడారు.
ఏమీ లేని స్థాయి నుండి వచ్చిన కేసీఆర్.. అత్యంత ధనికుడు అయ్యారని ఆరోపించారు. త్వరలో కేసిఆర్ ముఖేష్ అంబానీ కంటే ధనవంతుడు అయిపోతారని మండిపడ్డారు. ముఖేష్ వ్యాపారం చేస్తున్నాడు.. కేసీఆర్ కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. కేసీఆర్ ని ఇకనుంచి కమీషన్ చంద్రశేఖర్ అని పిలుద్దామని పేర్కొన్నారు. ఈ విధంగా తీవ్ర స్థాయిలో కెసిఆర్‌పై కాంగ్రెస్ ఇంఛార్జీ విరుచుకుపడడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఇందిరమ్మ నామినేషన్ వేసిన చోటు..
ఇందిరాగాందీ సంగారెడ్డి నుంచి నామినేషన్ వేసిన చోటు నుండే టిఆర్ఎస్ పార్టీపై తన పోరాటం సాగిస్తున్నట్లు మానికం తెలిపారు. ఆనాడు ఇందిరాగాంధీ ఇక్కడి నుండి నామినేషన్ వేశారని, అందుకే ఇక్కడి నుండి తాను ఇంఛార్జిగా కార్యక్రమాలు మొదలుపెట్టానని ఆయన పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని తనను ఇక్కడికి పంపించారని తెలిపారు. విజన్ 2023 పేరుతో ముందుకు వెళదామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 79 స్థానాలు కాంగ్రెస్ గెలిచి అధికారం కైవసం చేసుకోవాలని తెలిపారు.
తండ్రి, కొడుకు చేతిలోనే అధికారం..
తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరగాలని సోనియాగాంధీ ఆనాడు తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ ఆమె ఏ ఉద్ధేశ్యంతో ఇచ్చారో ఆ కల నెరవేరలేదని మాణికం పేర్కొన్నారు. కేసీఆర్.. ఆయన కొడుకు..అల్లుడు.. బిడ్డ చేతిలోనే అధికారం ఉండిపోయిందని, సామాన్యులకు ప్రగతి ఫలాలు అందడంలేదని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన అన్ని వర్గాల ప్రజలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి రావాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వంలో బంగారు తెలంగాణను నిర్మించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.











