అక్కినేనికి 97 ఏళ్లు, ఆయన నటనకు 80 ఏళ్లు. చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాల అధ్యాయం అక్కినేని నాగేశ్వరరావుది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఏయన్నార్, ఎన్టీఆర్.. రెండూ రెండు కళ్లు. ఆయనకు చదువు అబ్బలేదు.. కానీ ఆయనలో గొప్పనటుడే కాదు.. అంతకన్నా గొప్ప తాత్వికుడున్నాడు. ఈ సెప్టెంబరు 20వ తేదీ ఆయన పుట్టిన రోజు. తుదిశ్వాస వరకు నటించిన నటులు ఎవరన్నా ఉన్నారా అంటే అది అక్కినేని ఒక్కరే అని చెప్పాల్సి ఉంటుంది.
ఆయన తనలోని తాత్వికతను అ ఆలుగా ఆవిష్కరించారు. తెలుగు సినిమాని చదవాలంటే అక్కినేని అంతరంగాన్ని చదవాలి. తనలోని శక్తియుక్తుల్ని తప్ప మరి దేనినీ ఆయన నమ్మలేదు. తను పుట్టింది మొదలు చివరి శ్వాస వరకూ అవిశ్రాంతంగానే పోరాడారు. ఆయన మార్గం అనితర సాధ్యం. తనకన్నా అందగాడు, పౌరాణిక బ్రహ్మ ఎన్టీఆర్ తనకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నా ఆయన భయపడలేదు. ఎలా అధిగమిస్తూ ముందుకెళ్లాలా అనే ఆలోచించాడు.
రంగస్థలమే అన్నీ నేర్పంది
తెలుగు కళామతల్లి పురుడు పోసుకున్నదే రంగస్థలం మీద. ఆ రంగస్థలం మీదే అక్కినేని ఓనమాలు దిద్దారు. ఆ రంగస్థలం మీదే చిన్నప్పటి నుంచి వేషాలు వేస్తూ పేరు సంపాదించుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆయన ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్యకు కంటపడకపోయి ఉంటే ఓ మహానటుడిని మనం మిస్సయ్యేవారిమేమో. ఫ్లాట్ ఫామ్ బెంచి మీద కూర్చుని ఉన్న ఆ కుర్రాడిలో ముఖ వర్చస్సు బలరామయ్యను ఆకట్టుకుంది. కట్ చేస్తే సినిమా వేషం వచ్చేసింది. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని రామాపురం ఎక్కడ.. చెన్నపట్నం ఎక్కడ.
1941లో పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘ధర్మపత్ని’లో బాల నటునిగా తొలిసారి మేకప్ వేసుకున్నారు. 1944లో ఘంటసాల బలరామయ్య నిర్మాత, దర్శకుడిగా తెరకెక్కించిన ‘సీతారామ జననం’తో హీరో హోదా వచ్చేసింది. నూనూగు మీసాల వయసులోనే సినిమారంగంలో ఆయన అడుగుపెట్టడం, ప్రేక్షకులు ఆదరించడం జరిగిపోయింది. అప్పట్లో పెళ్లిళ్లు చిన్నపుడే చేసేవారు. ఆయనకు పెళ్ళి సంబంధాలు చూసినా వేషాలు వేసేవాడికి పిల్లనివ్వం అన్నారట. చివరికి బంధువుల అమ్మాయి విషయంలోనూ అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 1949లో అన్నపూర్ణతో ఆయన వివాహం జరిగింది.
ఎన్నో మైలు రాళ్లు
నటుడిగా ఎన్నో మైలు రాళ్లను ఆయన అధిరోహించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 256 సినిమాలు చేశారు. కుమారుడు, మనవళ్లతో ‘మనం’ సినిమాను చివరిసారిగా చేశారు. ఆయన సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే ఒకటా రెండా.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు. దేవదాసు (1953)లో భగ్న ప్రేమికుని పాత్ర, 1966లో ‘నవరాత్రి’ 9 పాత్రల పోషణ, లైలామజ్ను, అనార్కలి, బాటసారి, ప్రేమ్‌నగర్, ప్రేమాభిషేకం, మేఘసందేశం, చక్రధారి, ప్రేమనగర్, విచిత్రబంధం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉంటాయి.
పౌరాణిక పాత్రలనూ తక్కువగా ఏమీ చేయలేదు. హీరోగా తొలిసినిమా సీతారామ జననం లో ఆయన వేసింది శ్రీరాముడి వేషమే. ఆ తర్వాత మాయాబజార్‌లో అభిమన్యునిగా, చెంచులక్ష్మిలో విష్ణువుగా, భూకైలాస్‌లో నారదుడిగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునిడిగా నటించారు. కాకపోతే అలాంటి పాత్రల పోషణలో ఎన్టీఆర్ దూసుకు పోతుండటంతో తన పంథాను ఏయన్నార్ మార్చుకున్నారు. జయదేవ, కాళిదాసు, జక్కన, విప్రనారాయణ, చాణిక్యుడు లాంటి పాత్రల పోషణ ఆయనకు కొట్టినపిండి.
అవార్డులకు కొదవేముంది
నటుడిగా అక్కినేని సాధించిన అవార్డులు మరే నటుడూ సాధించి ఉండరు. 1989లో రాజ్‌కపూర్ స్మారక అవార్డు, 88లో రఘుపతి వెంకయ్య అవార్డు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్, అన్నా అవార్డు, పద్మశ్రీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఇలాచెప్పుకుంటూ పోతే ఆయన సాధించిన అవార్డులకు లెక్కే ఉండదు. వెండితెరతో ఏర్పడిన విడదీయరాని బంధం అక్కినేనిది. ఇప్పుడు సినిమా రంగంలో ఆయన వారసులు ఎందరు ఉన్నా ఆయన చరిత్ర మాత్రం నభూతో న భవిష్యతి.











