టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆట కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి కోసమే నంటూ 437 రోజుల తరువాత ధోని క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టారు. జులై 9 2019న ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ధోనికి చివరిది. ఆ మ్యాచ్ లో ధోని అవుటైన సమయం 7:29. అప్పటి నుంచి బ్యాట్ ముట్టని ధోని ఆగస్ట్ 15 2020న తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సమయం 7:29. దీంతో 7:29కి ధోనికి విడదీయరాని బంధం ఉందంటూ వార్తలు ప్రచారం జరిగాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ 7:29కి కీపింగ్ గ్లవుజ్ తో ధోని గ్రౌండ్ లోకి అడుగుపెట్టారు. 437 రోజుల తరువాత ధోని గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది.
తన మార్క్ చూపించిన ధోని
తనను మిస్టర్ కూల్ ఎందుకు అంటారో ధోని మరోమారు ఈ మ్యాచ్ ద్వారా రుజువు చేసుకున్నారు. టాస్ గెలిచిన వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సారధి సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఎఫెక్ట్ ఉంటుందని ముందే ఊహించారు. ముంబై ఇండియన్స్ ఓపెనర్లు డీకాక్, రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతుండటంతో తన అనుభవంతో బౌలింగ్ లో పలు మార్పులు చేశారు. దీపక్ చాహర్, సామ్ కరణ్, ఎంగిడి బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదురుకొని పరుగుల వరద పారిస్తున్న ముంబైని అడ్డుకట్ట వేసేందుకు 5వ ఓవర్ లోనే లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లాని బౌలింగ్ కు దింపి వికెట్ రాబట్టాడు. ఇదే సమయంలో భారీ పరుగులు ఇచ్చిన దీపక్ చాహర్, సామ్ కరణ్, ఎంగిడిలకు పదే పదే లైన్ & లెంగ్త్ తో బౌలింగ్ చేయమని సూచించారు.
అద్భుతమైన ఫీల్డర్ గా పేరు తెచ్చుకున్న డుప్లిసిస్ ను బౌండరీ లైన్ దగ్గర ధోని ఉంచారు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న హార్దిక్ పాండ్య, సౌరభ్ తివారి క్యాచ్ లను డుప్లిసిస్ అద్భుతరీతిలో అందుకున్నారు. డుప్లిసిస్ పట్టిన రెండు క్యాచ్ లతో 200 దాటుతున్న ముంబై కేవలం 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ మాదిరి లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రాయుడు, జడేజా, సామ్ కరణ్ లను ముందుకు పంపి తాను మాత్రం చివరగా వచ్చారు.
ధోని రివ్యూ సిస్టం
సుదీర్ఘ కాలం తరువాత బ్యాట్ పట్టిన ధోనిని తప్పుడు నిర్ణయం తీసుకొని అంపైర్ అవుట్ ఇచ్చాడు. వెంటనే ధోని డీఆర్ఎస్ తీసుకున్నారు. ఎప్పటిలాగే డీఆర్ఎస్ లో ధోని చెప్పింది నిజమంటూ నాటౌట్ గా తేలింది. దీంతో అభిమానులు డెసిషన్ రివ్యూ సిస్టం కాదు..ధోని రివ్యూ సిస్టం అంటూ సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ధోని అందరిని నిరాశపరిచారు. కేవలం 2 బంతులను మాత్రమే ఎదురుకున్న ధోని పరుగులేమి చేయకుండా నాటౌట్ గా నిలిచారు. తరువాతి మ్యాచ్ లలోనైనా ధోని తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.











