ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఇకపై జెట్ స్పీడు కనిపించనుంది. టీడీపీ గత పాలనలో అమరావతి రాజధానిగా ఎంపిక కాగా… వైసీపీ జమానాలో అప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఎక్కడకక్కడే నిలిచిపోయింది. వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణానికి ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పడలేదు. అయితే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ తిరిగి అదికారంలోకి రాగానే…అమరావతి నిర్మాణంలో మళ్లీ ఊపు కనిపించింది. టీడీపీ అధికారం చేపట్టి 4 నెలలే అవుతున్నా… ఐదేళ్ల తరబడి ఎక్కడికక్కడే నిలిచిన పనులకు పునరుజ్జీవం కలిగేలా చేసిందని చెప్పాలి. అమరావతి నిర్మాణంలో రానున్న రోజుల్లో జరిగే పరిణామాలు ఏ రీతిన, ఎంత వేగిరంగా జరుగుతాయన్న విషయంపై సీఆర్డీఏ కమీషనర్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్… దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణం అటకెక్కగా… అప్పటిదాకా జరిగిన పనులు నిలిచిపోయాయి. ఆ పనుల కోసం ప్రభుత్వ కొనుగోలు చేసపిన సామాగ్రి తుప్పుబట్టిపోయింది. మొత్తం అమరావతి నిర్మాణం కోసం సేకరించిన భూములంతా చెత్తాచెదారంతో నిండిపోయాయి. వెరసి మొన్నటిదాకా అమరావతిలో ఎక్కడ చూసినా కంపచెట్టే కనిపించాయి. అమరావతి ఓ మినీ జంగిల్ గా కనిపిచించందంటే… అతిశయోక్తి కాదేమో. ఈ దృశ్యాలను చూసి అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు కంటతడి పెట్టుకున్నారు. అమరావతి నిర్మాణం తిరిగి ప్రారంభం కావాలంటే…వైసీపీ అధికారం నుంచి దిగిపోవాలని, టీడీపీకి తిరిగి అధికారంలోకి రావాలని రైతులు పూజలు చేశారు. వారి పూజల ఫలితమో, ఏమో తెలియదు గానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేసిన టీడీపీ బంపర్ మెజారిటీతో అదికార పగ్గాలు చేపట్టింది. రైతులు కోరుకున్నట్లుగానే ఆ మరుక్షణమే అమరావతి నిర్మాణానికి పూనుకుంది.
అమరావతిలో పేరుకుపోయిన కంప చెట్లను తొలగించే కార్యక్రమానికి అధికారం చేపట్టిన వెంటనే టీడీపీ కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా యుద్ధప్రాతిపదికన విడుదల చేసింది. ఈ కంప చెట్ల తొలగింపు పూర్తి అయ్యిందని సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ తెలిపారు. అంతేకాకుండా కేవలం 20 రోజుల వ్యవధిలోనే అమరావతిలో నిర్మాణ కార్యకలాపాలను మొదలుపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆయన… వచ్చే వారంలోనే టెండర్ల ప్రక్రియను ముగిస్తామని తెలిపారు. రాజధానిలో అన్ని ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటినీ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వెరసి… అమరావతి నిర్మాణం ఇకపై ఆగేదే లే అన్న రీతిలో భాస్కర్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై అమరావతి రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.