ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో తెలియదు గానీ.. ఈ కేసు దర్యాప్తు మొత్తం వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారితో పాటు వైసీపీలో క్రియాశీల కార్యకర్తలుగా వ్యవహరించిన వారి చుట్టూనే తిరుగుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటిదాకా ఇటు సీబీఐ విచారణకు హాజరైన వారిలో టీడీపీతో అనుబంధం కలిగిన ఏ ఒక్కరూ లేకపోవడం కూడా గమనార్హమే. ఇక ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు నిన్న కోర్టులో ఓ చార్జిషీటు దాఖలు చేశారు. ఈ చార్జిషీటులో సీబీఐ పేర్కొన్న నలుగురు వ్యక్తులు కూడా వైసీపీతో అనుబంధం ఉన్న వారే తప్పించి టీడీపీతో అనుబంధం కలిగిన వారు కాకపోవడం కూడా ఆసక్తి రేకెత్తించేదే. మొత్తంగా జగన్ బాబాయి హత్య కేసులో వేళ్లన్నీ వైసీపీ వైపో, లేదంటే వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం కలిగి ఉన్న వారివైపో చూపిస్తుండటం గమనార్హం. ఈ విశ్లేషణలన్నీ చూస్తుంటే.. తన బాబాయి హత్ వెనుక ఘటన జరిగిన సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ హస్తముందంటూ జగన్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని తేలిపోయిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఆ నలుగురు ఎవరంటే..?
వివేకా హత్య కేసుకు సంబంధించి మూడు నెలలుగా సీబీఐ అధికారులు నాన్ స్టాప్‌గా దర్యాప్తు సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు అనుమానితుల వాంగ్మూలానను నమోదు చేసిన సీబీఐ.. వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసింది కూడా. ఈ అరెస్ట్‌లతో వివేకా హత్య కేసు మిస్టరీ వీడిపోయిందనే అంతా అనుకున్నారు. అయితే మిస్టరీ ఇంకా వీడలేదని స్వయంగా సీబీఐ చార్జిషీటే చెప్పేసింది. బుధవారం కోర్టులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో నలుగురు వ్యక్తుల పేర్లను ప్రస్తావించింది. వీరిలో ఒకరు వివేకాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎర్ర గంగిరెడ్డి, వివేకా వ్యవసాయ పనులను పర్యవేక్షించిన ఉమాశంకర్ రెడ్డి, వివేకా కారు డ్రైవర్ దస్తగిరి, పులివెందులకు చెందిన వైసీపీ క్రియాశీల కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. వీరిలో తొలి ఇద్దరూ వివేకాకు అత్యంత సన్నిహితంగా మెలగిన వ్యక్తులు కాగా.. దస్తగిరి ఆయన కారుకు డ్రైవర్‌గా పనిచేసిన యువకుడు. ఇక సునీల్ కుమార్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డి ద్వారా వివేకాకు పరిచయం అయిన వైసీపీ క్రియాశీల కార్యకర్త. అంటే.. సీబీఐ అనుమానితుల జాబితాలో ముగ్గురు వ్యక్తులు వివేకాతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు కాగా.. మరొకరు జగన్ సొంతూరు పులివెందులలో జగన్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరించిన యువకుడు. ఇలా నలుగురికీ అటు వైసీపీతోనో, లేదంటే ఇటు వైఎస్ ఫ్యామిలీతోనే సంబంధాలున్నాయే తప్పించి.. ఈ నలుగురు వ్యక్తులకూ టీడీపీతో ఎలాంటి సంబంధాలు లేవన్న విషయం తేలిపోయినట్టే కదా.
మిస్టరీ వీడేనా?
గతంలో వివేకా హత్య కేసును విచారించేందుకు టీడీపీ సర్కారు ఓ సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. దానిపై నమ్మకం లేదంటూ జగన్ సర్కారు మరో సిట్ ను నియమించింది. అయితే ఈ రెండు సిట్‌ల దర్యాప్తు తీరుతెన్నులను చూసిన తర్వాత అనుమానం వచ్చిన వివేకా కూతురు సునీత నేరుగా హైకోర్టును ఆశ్రయించింది. సీఎంగా తన సోదరుడు జగనే ఉన్నప్పటికి.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని సంచలన పిటిషన్‌ను దాఖలు చేసింది. తనకు న్యాయం జరగాలంటే సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది. సునీత డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చి కూడా ఏడాదికి పైగానే అవుతోంది. అయినా కూడా ఈ వివేకా హత్య ఎందుకు జరిగింది? అందులో ఎవరెవరికి హస్తముంది? అన్న విషయాలను సీబీఐ అధికారులు రాబట్టలేకపోయారు. ఇదిలా ఉంటే.. ఓ దశలో ఈ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందన్న వార్తలు వినిపించగా.. దర్యాప్తు బృందానికి నేతృత్వం విహిస్తున్న అధికారిని బదిలీ చేసిన సీబీఐ మరో అధికారిని నియమించింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. అసలు వివేకా హత్య కేసు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.