కామెడీ హీరోగా టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసిన అల్లరి నరేశ్.. తన తండ్రి సారధ్యంలో ఎన్నో విజయాలందు కొన్నాడు. ఒక దశలో తెలుగు నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో అయ్యాడు. అయితే రాను రాను అతడి కామెడీ .. అతడు ఎంచుకొనే కథలు ప్రేక్షకులకు రోటీన్ టేస్ట్ అందించడంతో.. కొంతకాలంగా టాలీవుడ్ లో పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. అయితే అతడిలో మంచి కామెడీ టైమింగ్ ఉండడంతో పాటు.. మంచి నటుడు కూడా దాగి ఉండడంతో కెరీర్ బిగినింగ్ లోనే నేను, ప్రాణం లాంటి సినిమాలు చేసి తన విలక్షణతను చాటుకున్నాడు.
ఇకపై నరేశ్ తన పంథా మార్చుకుంటున్నాడు. ఆలోచింపచేసే కథలతో సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ.. తను కేవలం కామెడీ హీరోనే కాదు అనే సంకేతాన్నిస్తున్నాడు. దీనికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అతడి తాజా చిత్రం నాంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదలైంది. బ్రీత్ ఆఫ్ నాందిగా విడుదలైన ఈ టీజర్ లో నరేశ్ నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నరేశ్ 57వ సినిమాగా తెరకెక్కుతోన్న నాంది షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.
15 లక్షలమంది ప్రాణ త్యాగం చేసుకుంటేనే గానీ మనదేశానికి స్వాతంత్ర్యం రాలేదు. ఎంతో మంది బలిదానం చేసుకుంటేనే కానీ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు .న్యాయం గెలవాలి.. అంటూ అల్లరి నరేశ్ ఉద్వేగంగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నరేశ్ ను నగ్నంగా చేసి కాళ్ళ చేతులు కట్టేసి బంధిస్తారు. ఖైదీగా అడుగుపెట్టిన అతడిని పోలీస్ లు బాగా టార్చర్ పెట్టినట్టు అనిపిస్తోంది. మొత్తానికి నరేశ్ ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ఎలివేట్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. త్వరలో థియేటర్స్ లోనే విడుదల కానున్న నాంది సినిమా నరేశ్ కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.











