నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3 వేల 535 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఆసియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు-ADB నుంచి మొదటి రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రూ. 6 వేల 700 కోట్లు, ADB రూ. 6700 కోట్లు కలిపి మొత్తం రూ. 13 వేల 600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి. మరో రూ. 1400 కోట్లు కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందించనుంది. ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి రూ. 11 వేల కోట్ల రుణసమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దానికి సంబంధించిన అనుమతి లేఖ సైతం రాష్ట్రానికి వచ్చింది. ఇక జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.
నిధులు రాకుండా వైసీపీ కుట్ర –
అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో రూ.6,700 కోట్ల చొప్పున రుణాన్ని గతేడాది డిసెంబరులో ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సింది. కానీ ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది. 2018లో కూడా వైసీపీ ఇలాంటి కుట్రలే చేసి అమరావతికి అప్పు రాకుండా కుట్రలు చేసింది. కానీ ఈ సారి వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. కానీ ఆ నిధులు రాకుండా నాటి ప్రతిపక్ష నేత జగన్, విజయసాయిరెడ్డి కుట్రలు పన్నారు. అప్పటి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారు. అమరావతి వరదలకు మునిగిపోతుందని పదేపదే మెయిల్స్ పంపారు.
రాజధాని గ్రామాలతో సంబంధంలేని రైతులతోనూ ఫిర్యాదులు చేయించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ తన పత్రికలో వార్తలు రాయించారు. ఈ పరిణామాలతో ఆ సమయంలో ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్…అమరావతి నిర్మాణానికి తమకు రుణం అవసరం లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. 2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను క్లోజ్ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయారు. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, కరకట్ట రోడ్డు వంటి 19 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విలువ రూ.16,871 కోట్లు. చంద్రబాబు సీఎం అయ్యాక వీటికి అంచనాలు తయారుచేశారు. 31 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. పనులకు టెండర్లు కూడా ఖరారు చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది. ఏప్రిల్ మూడో వారంలో ప్రధాని చేతుల మీదగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్దసంఖ్యలో కార్మికులు వస్తున్నారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే పనులు కూడా కొనసాగుతుండడంతో ఇన్‌ఫ్రా కంపెనీలకు చేతినిండా పని ఉంటోంది. నిర్మాణాలకు ముందస్తు ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయా సంస్థలు బిజీగా ఉన్నాయి. గతంలో ఆగిపోయిన ప్రభుత్వ భవనాల వద్ద కార్మికుల కోసం భారీస్థాయిలో రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. క్లాస్-4, న్యాయమూర్తులు, మంత్రుల భవనాల నిర్మాణ కాంట్రాక్టు పొందిన BSR ఇన్‌ఫ్రా సంస్థ..దాదాపు 200 మంది కార్మికుల కోసం షెడ్డును రెడీ చేసింది.
హ్యాపీనెస్ట్ కాంట్రాక్టు పొందిన NCC సంస్థ షెడ్లను నిర్మించింది. జడ్జిల భవన సముదాయం దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి. రాజధానిలో ఈ-6 నిర్మాణ కాంట్రాక్టు తాజాగా పొందిన RVR కంపెనీ తుళ్లూరు శివారులో గతంలో వేసిన షెడ్లను సకల సౌకర్యాలతో కార్మికుల కోసం సిద్ధం చేస్తోంది. సీఎం చంద్రబాబు వెలగపూడిలో ఇటీవల కొన్న స్థలానికి సంబంధించి BSR సంస్థ పనులు ప్రారంభించింది. రాయపూడి కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఫిల్టర్ ట్యాంకు పైపులైను పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు కంప చెట్ల తొలగింపు, మెరక, చదును చేయడం వంటి పనుల్లో పెద్దసంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం –
రాజధాని పనులను పునఃప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోదీ ఈ నెలలో అమరావతికి రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ బుధవారం అమరావతి సచివాలయంలో అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తిస్థాయిలో ఏర్పాట్లపై సమీక్షిస్తామని, ఈలోపు శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని ఆదేశించారు.
రాజధాని అమరావతిలో సింగపూర్ కన్సార్షియం బృందం బుధవారం పర్యటించింది. స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కోరిన నేపథ్యంలో ఈ బృందం రాజధానిలో పర్యటించింది. కోర్ క్యాపిటల్ పరిధిలోని పలు ప్రభుత్వ భవన సముదాయాలు, ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల భవన సముదాయంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధుల భవనాలను పరిశీలించింది. గతంలో రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఉద్దండరాయునిపాలెం- తాళ్లాయపాలెం పరిధిలో 1,900 ఎకరాల భూమి సింగపూర్ కన్సార్షియం తీసుకుంది.
ఐదేళ్ల తర్వాత పరిస్థితులపై తాజాగా బృందం ఆరా తీసింది. వరద నియంత్రణకు తీసుకున్న చర్యలు, కరకట్ట రోడ్డు పరిస్థితులను పరిశీలించింది. అనంతరం సీఎస్ విజయానంద్, CRDA ఉన్నతాధికారులతో ప్రతినిధి బృందం సచివాలయంలో భేటీ అయింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మాదిరిగానే ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని సీఎస్ వారికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ…రాజధానిని త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అంతకుముందు సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రజా రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. సుమారు రూ.లక్ష కోట్ల పనులు పునఃప్రారంభం, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రధాని మోదీ ఈ నెలలోనే శ్రీకారం చుట్టనున్నారని వివరించారు.