ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. ఆయన ఫామ్‌హౌస్ నిర్మించిన స్థలంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అక్రమంగా కట్టిన నిర్మాణాలపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.
వివాదం ఏంటి –
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చెరువు సమీపంలో కేతిరెడ్డి సోదరుడు వెంకటకృష్ణారెడ్డి భార్య వసుమతి సర్వే నంబర్ 905-2 లో 2 ఎకరాల 42 సెంట్ల భూమిని ముగ్గురు నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 1960లో నారాయణ, తలారి అంజనమ్మ, ఓబులమ్మ కుటుంబాలకు వ్యవసాయం చేసుకునేందుకు నాటి ప్రభుత్వం భూములు కేటాయించింది. వీటిని కొనుగోలు చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరం. అయినా ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు గుర్రాలకొండపై ఫామ్ హౌస్ కట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు వసుమతికి అధికారులు నోటీసులు పంపించారు. గతంలో తాను గెస్ట్‌హౌస్ నిర్మించిన స్థలం ప్రభుత్వ స్థలం కాదని కేతిరెడ్డి సవాల్ చేశారు.
ఐతే నోటీసులను పోస్టులో పంపించడంతో వాటిని వసుమతి అందుకోలేదని తెలుస్తోంది. ఇక భూములు అక్రమంగా విక్రయించిన ముగ్గురికి సైతం నోటీసులు ఇచ్చారు అధికారులు. కేతిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి అధికారుల బృందం అక్కడికి వెళ్లగా గేటుకు తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు. దీంతో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.