కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన మాటకు అనుగుణంగా పింఛను పెంపును అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. అంతే కాదు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుడి ఇంటికెళ్లి పింఛను అందజేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో దివ్యాంగురాలు వడ్లమూడి సుభాషిణికి రూ.15 వేలు పింఛను అందించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇద్దరు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.10 లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా వడ్డీలు కట్టాల్సి వస్తోందన్నారు. అయినా పది నెలలుగా క్రమం తప్పకుండా ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలుంటే ప్రతి నెలా 64 లక్షలమందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అంటే సగటున ప్రతి రెండున్నర కుటుంబాలలో ఒకరికి పింఛను ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు చంద్రబాబు.
గతంలో బటన్లు నొక్కేవారని జగన్ ఉద్దేశించి సెటైర్లు వేశారు చంద్రబాబు. ఆ బటన్లన్నీ కూటమి సర్కార్ ఇచ్చే ఒక్క పింఛన్లకే సమానమన్నారు. నెలకు రూ.4 వేల పింఛను అంటే ఏడాదికి 48 వేలు అందిస్తున్నామన్నారు. ఒక ఎకరా భూమిలో సాగు చేస్తే ఎంత వస్తుందో ఆలోచించాలన్నారు. సంపద సృష్టించి, వచ్చిన ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు పెడుతున్నామన్నారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తామన్నారు.
పింఛన్ల పంపిణీలో అధికారుల కృషిని ప్రశంసించారు చంద్రబాబు. వలస వెళ్లిన కూలీలు ప్రతి నెలా పింఛను తీసుకోలేరనే ఉద్దేశంతో 3 నెలలు తీసుకోకున్నా ఒకేసారి ఇస్తున్నామన్నారు. ప్రతినెలా మొదటి రోజే 98 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు. అధికారులు పోటీ పడి సేవలందిస్తున్నారని అంటూ వారి సేవలను శభాస్ అంటూ అభినందించారు.
ఒక్కసారి అమరావతి పూర్తయితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. 3-4 ఏళ్లలో అమరావతికి పునర్‌వైభవం తెస్తామన్నారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి లాంటిదన్నారు. చినగంజాం పక్కనే సముద్రం ఉన్నా నీళ్లు లేవన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని, 2027 నాటికి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తామన్నారు. విశాఖ ఉక్కు కూడా గాడిలో పడుతోందన్నారు. పరిపాలన సమర్థంగా చేస్తే ఏదైనా బాగవుతుందన్నారు చంద్రబాబు. ఇక నిరుద్యోగులకు సైతం గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే డీఎస్సీ ప్రకటన ఇచ్చి..జూన్‌లోపు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు జూన్‌లోపు తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. మే, జూన్ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నందున మత్స్యకారుల కుటుంబాలకు ఈ నెలలో 20 వేల రూపాయలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. పేదరికాన్ని తొలగించడానికి P-4 కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. తన సలహాలను పాటిస్తే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని, తనను విమర్శించే వారు 100 కుటుంబాలను బాగు చేస్తే పిలిచి సన్మానిస్తానని సవాల్ విసిరారు చంద్రబాబు. మాటలు చెప్పి చెడగొడితే మంచి జరగదన్నారు.