వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాకిచ్చారు పోలీసులు. ఆయనపై కేసు నమోదైంది. బుధవారం గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పోలీసులను రాంబాబు బెదిరించారు. ఈక్రమంలో విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో అంబటి రాంబాబు సహా మరికొందరు వైసీపీ నేతలపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే!
బుధవారం గుంటూరులోని సిద్ధార్థనగర్‌లోని నివాసం నుంచి అంబటి అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డుచెప్పడంతో..కుందులు రోడ్డు జంక్షన్‌లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడా పోలీసులు అడ్డుకున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి ఇంతమందిని వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు.
దీంతో అంబటి రాంబాబు రెచ్చిపోయారు..తనను ఎలా పోనివ్వరో చూస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి అనుమతించేది లేదని సీఐ తేల్చిచెప్పారు. సహనం కోల్పోయిన అంబటి రాంబాబు ‘ఏం చేస్తావ్..’ అంటూ అభ్యంతరకరంగా మాట్లాడడంతో ‘మర్యాదగా మాట్లాడండి..నోరు అదుపులో పెట్టుకోండి’ అని సీఐ సైతం ఘాటుగా బదులిచ్చారు. దీంతో అంబటి రాంబాబు పళ్లు కొరుకుతూ నాలుక మడతపెట్టి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పళ్లు కొరుకుతున్నారేంటి..మీ బెదిరింపులకు భయపడేవారెవ్వరూ ఇక్కడ లేరని సీఐ స్పష్టం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అంబటి రాంబాబు నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఒక్కో వాహనాన్ని పోలీసులు అనుమతించారు. ఈ ఘటనకు సంబంధించి అంబటి రాంబాబు సహా కొంతమందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.