తెలుగులో ఎ1 రైటర్ యండమూరి వీరేంద్రనాథ్. ఒకప్పుడు ఆయన నవలలన్నీ వరుసబెట్టి సినిమాలుగా వచ్చేవి. ఒకపక్క సీరియల్ గా ఉండగానే.. సినిమా అనౌన్స్ మెంట్ జరిగేది. దాంతో ప్రేక్షక పాఠకులు ఆత్రుతగా నవల చదివేసి.. సినిమా గురించి ఎదురుచూసేవారు. దాదాపు ఆయన క్రేజీ నవలలన్నీ సినిమాలుగా తెరకెక్కాయి. కానీ ఇంతవరకూ ఆయన రాసిన ఓ అద్భుతమైన నవలకి తెరరూపం ఎవరూ కల్పించలేకపోయారు. అదే ఆనందో బ్రహ్మ. ఆయన రాసిన నవలలన్నింటిలోకీ హైలీ ఇంటలెక్చువల్ నోవల్ ‘ఆనందో బ్రహ్మ’. ఎట్టకేలకు ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. ఈ నవల ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాగా తెరకెక్కడం .. అది కూడా మన తెలుగువాడే దాన్ని నిర్మించడం.. ఆనవలకి దక్కిన గౌరవంగా అందరూ భావిస్తున్నారు.
కొన్నేళ్ళ క్రితం హాలీవుడ్ సినీ నిర్మాత అయిన మన తెలుగువాడు .. ముక్తేశ్వరరావు మేక హైద్రాబాద్ వచ్చారు. అప్పుడు ఆనందో బ్రహ్మ నవలరైట్స్ ను యండమూరి నుంచి రెండేళ్ళకు గాను కొనుగోలు చేశారు. కానీ అప్పట్లో దాన్ని సినిమాగా తీయలేకపోయారు ఆయన. ఇటీవలే భారత్ కు వచ్చిన ముక్తేష్ రావు మేక మళ్లీ ‘ఆనందో బ్రహ్మ నవల హక్కులను పొందారు. ఈసారి సినిమా తీస్తానని.. గోదావరి తీరాన జరిగిన ఈ కథను అమెరికాలోని మిసిసిపీ నదీ తీరంలో తీస్తానని ఆయన తెలిపారు. 35 ఏళ్ల కల సాకారం అయ్యిందని.. ఇదొక యూనివర్సల్ స్టోరీ అని అన్నారు. ఆనందో బ్రహ్మ నవలను సినిమాగా తీయడానికి ధైర్యసాహసాలు ఉండాలని.. ఈ ఒక్క నవల మాత్రం అమ్ముడు పోలేదని.. తాజాగా ఇది అమ్ముడుపోయి కల సాకారమైందని రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తెలిపారు.











