(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. 22 రోజులుగా ప్రతి రోజూ దాదాపు పదివేల కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనే కరోనా అత్యధిక కేసులు ఉన్న మూడో రాష్ట్రంగా ఏపీ అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో15 రోజుల్లో మహారాష్ట్రను అధిగమించి ఏపీ మొదటి స్థానం చేరుకోనుందని అంచనా. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా కోవిడ్ ఇంత వేగంగా ఎందుకు విస్తరిస్తోంది. కరెోనా బాధితులకు అరగంటలో బెడ్ కేటాయించాలని ముఖ్యమంత్రి పదే పదే చెబుతన్నా అది కేవలం పత్రికల్లో వార్తలు వ్రాయడానికే పనికి వస్తోందా? అనే అనుమానాలు ప్రజల్లో పుడుతున్నాయి. .
‘ఎక్కువ టెస్టులు’ పేరుతో బుకాయిస్తున్నారా?
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏపీలో ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్నామని అందుకే పెద్ద ఎత్తున కేసులు బయట పడుతున్నాయని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 లక్షల టెస్టులు చేశామని, ఇది ఒక రికార్డని ఆయన గొప్పగా చెబుతున్నారు. పక్కనున్న తెలంగాణలో కేవలం 10 లక్షల టెస్టులు మాత్రమే చేశారని ఆయన గుర్తుచేశారు.
గణాంకాలు బాగానే ఉన్నాయి. టెస్టులు జరపడం పరంగా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కానీ క్షేత్రస్థాయిలో ఈ కృషికి కూడా దెబ్బ పడుతోంది. టెస్టులు చేసిన వారికి రెండు వారాలు గడిచేవరకు కూడా రిజల్టు చెప్పడం లేదు. నెగటివ్ వచ్చేలోగా వారికి కరోనాసోకినా సోకే ప్రమాదం. ఒకవేళ పాజిటివ్ ఉన్నట్లయితే రిపోర్టు వచ్చేలోగా మరిన్ని వందల మందికి అంటించే ప్రమాదం రెండూ ఉంటున్నాయి. కానీ ఈ అలసత్వ స్థితిలో సర్కారు మార్పు తేలేకపోతోంది.
ఏపీలో ఇప్పటికే 35 లక్షల టెస్టులు చేయడం ద్వారా 3 లక్షల కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికే కోవిడ్ బారిన పడి 3 వేల మంది మరణించారు. కరోనా కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ కొత్తగా పదివేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. వంద మంది చనిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట పడేది ఎప్పుడు?
టెస్టులు సరే.. ఒక్క బాబ్లెట్ అయినా ఇస్తున్నారా?
ఏపీలో వింత పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి మాత్రం కోవిడ్ పేషంట్లు వస్తే అరగంటలో బెడ్ ఇచ్చేయాలని అని హుకుం జారీ చేస్తారు. ఇవ్వకుంటే కఠిన చర్యలు అంటారు. ఆయన స్ఫూర్తి మాత్రం గొప్పదే. కానీ వాస్తవంలో కోవిడ్ బాధితులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే బెడ్ లేదు వెళ్లిపోండి అంటారు. ఈ పరిస్థితి జగన్ దాకా తెలుస్తోందో లేదో అర్థం కావడం లేదు.
ఆర్థిక స్తోమత ఉండి ప్రయివేటు ఆస్పత్రికి వెళితే అక్కడా ఇదే పరిస్థితి. ఎవరో ఒక మంత్రి లెటర్ ఉంటేనే ప్రయివేట్ ఆస్పత్రిలో బెడ్ దొరుకుతుంది. ఇక లక్షల్లో బిల్లులు మామూలే.
కరోనా ట్రీట్ మెంట్ కేంద్రాలుగా ఇంజనీరింగ్ కాలేజీలను పెట్టారంటేనే ఈ ప్రభుత్వానికి కరోనా అదుపు చేయడంపై ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థం అవుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీసం ఒక్క బెడ్ ఉండదు. పేషెంబ్లు బల్లలపై పడుకోవాల్సి వస్తోంది. ఆక్సిజన్ అవసరం అయితే అక్కడ దొరకదు. కనీసం బాధితులకు మంచినీరు, భోజనం కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నారని దేవినేని తప్పుపట్టారు. ఒక్కో కరోనా బాధితుడికి ఒక రోజు ఆహారం అందించేందుకు వైసీపీ నేతలు రూ.500 బిల్లు పెడుతున్నారని ఇది పెద్ద కుంభకోణమని ఆయన విమర్శించారు. నెల్లూరు కోవిడ్ సెంటర్లో ఆక్సిజన్ లేక బాధితుడు కిందపడి గిలాగిలా కొట్టుకుని చనిపోయినా డాక్టర్లు రాలేదని దేవినేని గుర్తుచేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే ప్రతి రోజూ 2 వేల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పది హేను రోజుల కిందటి వరకు పట్టణాలు, మున్సిపాలిటీలకే పరిమితమైన కోవిడ్ నేడు గ్రామీణ ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా ఇదే వేగంతో వ్యాప్తి చెందితే రాబోయే రెండు వారాల్లోనే దేశంలోనే ఏపీ నెంబర్ వన్ కానుంది. ఇప్పటికే కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కేవలం టెస్టులకే పరిమితం అయింది. టెస్టులపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. టెస్టులు చేయకుండానే బిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి రోజూ లక్ష టెస్టులు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి చెబుతున్నా దీనిపై అనుమానాలు ఉన్నాయి. ఏపీలో రోజూ లక్ష మందికి టెస్టులు చేసే సౌకర్యాలే లేవని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కరోనా విషయంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందనే భయం ప్రజల్లో ఉంది.