కరోనాను ఎదుర్కొనేందుకు మన దేశంలో అభివృద్ధి పరచి,ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాతో యాంటీబాడీలు వృద్ధిచెంద లేదని సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలాపై పోలీసులకు ఫిర్యాదు అందింది.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆసియానా పోలీస్ స్టేషన్‌లో ప్రతాప్ చంద్ర అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలాపై ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.తాను కోవీషీల్డ్ టీకా తీసుకున్నా కూడా యాంటీబాడీలు వృద్ధి చెందలేదని లక్నోకు చెందిన ప్రతాప్ చంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు.తాను ఏప్రిల్ 8న కోవీషీల్డ్ మొదటి డోసు తీసుకున్నానని,తరువాత 28 రోజులకు రెండో డోసు తీసుకోవాల్సి ఉందని,అయితే రెండో డోసు తీసుకునే సమయం ఆరువారాలకు పెంచారని,ఆ తరవాత కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండు డోసుల మధ్య సమయాన్ని 12 వారాలకు పెంచిందని ఆయన ఫిర్యాదులో వివరించారు.
ప్లేట్ లెట్లు తగ్గాయి..
కోవీషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తరవాత ప్లేట్ లెట్ల సంఖ్య 3 లక్షల నుంచి 1.5 లక్షలకు పడిపోయిందని ప్రతాప్ చంద్ర వెల్లడించారు.దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వార్,ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణా ఉపాధ్యాయలపై కూడా ఫిర్యాదు చేశారు.అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.ఉన్నతాధికారులతో సంప్రదించి నిర్ణయం వెల్లడిస్తామని వారు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రతాప్ చంద్ర చెప్పారు.











