జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి పునర్నిర్మించడానికి సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో మహానాడు ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు..ఏపీకి తానే బ్రాండ్ అంబాసిడర్‌నని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులు సాధించడానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్న మాట నిజమేనన్నారు చంద్రబాబు.
అయితే మార్కెట్‌లో చాలా బ్రాండ్లు ఉన్నా కొన్నింటికే విలువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు నేనే బ్రాండ్. ఈ బ్రాండ్ పనితీరుకు కాన్సెప్ట్ ప్రూఫ్ ఉంది. అందువల్ల స్వయంగా వచ్చి పరిశీలించాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. విశ్వసనీయత రావడానికి సమయం పడుతుంది తప్పితే రాత్రికి రాత్రే సాధ్యం కాదన్నారు చంద్రబాబు. అందుకే పోటీలో నేను మిగతావారి కంటే మిన్నగా నిలవగలుగుతున్నానని చెప్పారు. మిగతా కొలమానాల్లో సమానంగా ఉన్నా పనితీరులో తన శైలి భిన్నంగా ఉంటుందన్నారు. తన పనితీరును చూసి పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి అని సంబోధించడానికి బదులు CEO అనడానికి ఇష్టపడతారని సంజయ్‌పురి అన్నప్పుడు చంద్రబాబు నవ్వుతూ..ఆ పిలుపు ఒకప్పుడు తనకు ఎంతో నష్టం కలిగించిందన్నారు చంద్రబాబు.
ఇక ఈ నెల ఏపీలోని ఓ నియోజకవర్గంలో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సేవలు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు చంద్రబాబు. ఆ ప్రాంతంలోని వైద్య నిపుణులందర్నీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చి వారికి ప్రపంచస్థాయి పరిజ్ఞానం, ఏఐ వినియోగం గురించి శిక్షణ ఇస్తామని చెప్పారు. దానివల్ల ఆసుపత్రుల్లో వృథా ఖర్చులు తగ్గుతాయన్నారు. తన మీద నమ్మకంతో బిల్ గేట్స్ దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలుచేయడానికి ముందుకొస్తున్నారని చెప్పారు చంద్రబాబు. ఇక్కడ విజయవంతమైన తర్వాత దాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలుచేస్తామన్నారని చెప్పారు. ఆరు నెలల్లోపు దీన్ని ఒక జిల్లాలో అమలుచేసి రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.
డబ్బు లేకపోయినా ప్రభుత్వ విధానాలతో అద్భుతాలు చేయొచ్చనడానికి చెన్నై-నెల్లూరు మధ్య నిర్మించిన తొలి జాతీయ రహదారే ఉదాహరణగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్రభుత్వ విధాన సత్తాను నిరూపించి తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశామన్నారు. దానివల్లే నాలుగేళ్లలో స్వర్ణ చతుర్భుజి నిర్మాణం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం ఏపీలో 29 శాతం గ్రీనరీ ఉందని, దానిని 50 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీలో వ్యవసాయరంగం వాటా 35%గా ఉందన్నారు. గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చడానికి ఒక ప్రాంతాన్ని పూర్తిగా హార్టికల్చర్ హబ్‌గా, మరో ప్రాంతాన్ని సముద్ర ఉత్పత్తుల కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆహార అలవాట్లు మారినందున వ్యవసాయ స్వరూపాన్నీ మార్చాలన్నారు. 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అరకు కాఫీని ఇప్పుడు ప్రపంచబ్రాండ్‌గా మార్చామని చెప్పారు చంద్రబాబు. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్ర ఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తామన్నారు.
ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని చెప్పారు చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేల హోటల్ గదుల దాకా ఉన్నాయని. వచ్చే ఐదేళ్లలో 50వేల గదులు తేవాలనుకుంటున్నామని చెప్పారు. అంటే దాదాపు వెయ్యి హోటళ్లు వస్తాయి. కొత్త ఆలోచనలు ఎవరు చెప్పినా స్వీకరించి ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అమరావతి మొదటిదశ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అన్ని అధునాతన సౌకర్యాలతో వచ్చే వందేళ్లకు సరిపోయేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. స్వాతంత్య్రానంతరం సంపూర్ణ సౌకర్యాలతో నిర్మిస్తున్న తొలి నగరం అమరావతే అవుతుందన్నారు. చండీగఢ్ పరిపాలన నగరం మాత్రమేనని..అమరావతిలో అన్ని రంగాలూ ఉండేలా చూస్తున్నామన్నారు చంద్రబాబు.