ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్‌లో కీలక సూత్రధారులు, పాత్ర ధారులు అంతా కటకటాలు లెక్కపెడుతున్నారు. ఐతే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడు. మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎవరు మాట్లాడవద్దని..అనవసరంగా మాట్లాడితే మరో రకంగా వెళ్తుందని మంత్రులకు చంద్రబాబు సూచించారు.
లిక్కర్ స్కామ్‌పై సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని, వాళ్ల పని వాళ్లని చేసుకోనివ్వాలని మంత్రులకు చెప్పారు. మద్యం కుంభకోణంపై మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుందని… అందుకని దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సూచించారు. మద్యం కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి ఎవరు మాట్లాడవద్దని సీఎం స్పష్టం చేశారు.
ఏపీలో రూ.3 వేల కోట్లకు లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. దేశంలోనే అతిపెద్ద స్కామ్‌గా కూటమి నేతలు చెప్తున్నారు. ఈ స్కామ్‌పై విచారణ జరిపేందుకు కూటమి సర్కార్ ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ పలువురిని అరెస్టు చేసింది. రాజ్ కెసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుంది. మరోవైపు లిక్కర్ స్కామ్ నిందితులకు ACB కోర్టు రిమాండ్ పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో నిందితులను సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ఇక ఈ కేసులో మాజీ సీఎం జగన్ అరెస్టు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది.
మరోవైపు, ఈ నెల 24న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోఆయన ప్రత్యేకంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.. ఈ కేసులోకి తాజాగా ఈడీ కూడా ఎంటర్ అయింది.. లేటెస్ట్‌గా తాను సేకరించిన డేటాని ఈడీకి అందించింది ఏసీబీ కోర్ట్… దీంతో, లిక్కర్ కేసులో ఏదో జరగబోతోందనే చర్చ సాగుతోంది.. ఈ బ్యాక్ డ్రాప్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్‌ఎల్‌ఏలను మద్యం స్కామ్‌లో సైలెంట్‌గా ఉండాలని సూచించినట్లు భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. ఇటు, తన అంతరంగికులతో సైతం తన అరెస్ట్‌పై జగన్ మనసు విప్పి మాట్లాడుతున్నారని సమాచారం.. అంటే, రాబోయే కొద్ది రోజుల్లోనే లిక్కర్ స్కామ్‌లో బిగ్ బాస్ అరెస్ట్ ఖాయమని వైసీపీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.. మరి, ఏం జరుగుతుందో చూడాలి..











